మేడ మీద అబ్బాయి.. ఏం చేస్తాడో మ‌రి..?

ఒక‌ప్పుడు అల్ల‌రి న‌రేష్ కు ఉన్న క్రేజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌డం సాధ్యం కాదు. ఈయ‌న‌తో సినిమా అంటే నిర్మాత‌లు ఎగ‌బ‌డేవారు. ఈయ‌న డేట్స్ ఉంటే సినిమా హిట్ అనే ఊహ‌ల్లో ఉండేవాళ్లు. కానీ కొన్నాళ్లుగా న‌రేష్ టైమ్ బాలేదు. ఇప్పుడు కూడా మేడ మీద అబ్బాయిగా వ‌స్తున్నాడు అల్ల‌రోడు. ఐదేళ్ల కింద వ‌చ్చిన సుడిగాడుతో ఏకంగా 16 కోట్లు వ‌సూలు చేస్తే న‌రేష్ స్టార్ హీరో అయిపోయాడ‌నుకున్నారంతా. కానీ అదంతా అప్ప‌టికి వ‌చ్చే తుఫాన్ అని తెలియ‌లేదు. ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా వ‌చ్చిన అన్ని సినిమాలు ట‌పా క‌ట్టేసాయి. 

జేమ్స్ బాండ్, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి లాంటి సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. అవి నిల‌బ‌డ‌లేదంటే క‌చ్చితంగా న‌రేష్ పై న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో స‌న్న‌గిల్లిన‌ట్లే. న‌రేష్ కెరీర్ ప్ర‌స్తుతం ఎటూ కాకుండా ఉంది. సుడిగాడులో ఆల్రెడీ బోలెడ‌న్ని స్పూఫ్ లు చేసాడు. గ‌తేడాది వ‌చ్చిన‌ సెల్ఫీరాజా, ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం సినిమాలు కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌జీత్ తో మేడ మీద అబ్బాయి సినిమా చేస్తున్నాడు న‌రేష్. మ‌ళ‌యాలంలో సూప‌ర్ హిట్టైన ఒరు వ‌డ‌క్క‌న్ సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మేడ మీద అబ్బాయి సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. మ‌రి ఈ చిత్రంతోనైనా న‌రేష్ కెరీర్ గాడిన ప‌డుతుందో లేదో చూడాలిక‌..!