మీడియా.. కేసీఆర్. ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు..!

తెలంగాణలో రెండు న్యూస్ ఛానెళ్లపై ఎంఎస్‌వోలు నిషేధం విధించి నేటితో 88 రోజులు పూర్తయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా వార్తలు ఆ రెండు ఛానెళ్లలో వచ్చాయన్న కారణంతో ఆయనే వాటిని మూసివేయించారని మీడియా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆ రెండు ఛానెళ్లలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వార్తలు వచ్చినందున ఎంఎస్‌వోలే ఈ రెండు ఛానెళ్లపై నిషేధం విధించారని దీంతో తమకు సంబంధం లేదని సీఎం కేసీఆర్‌తో సహా ప్రతి ఒక్క తెరాస నాయకుడు కూడా చెపుతున్న మాటలు. ప్రస్తుతం డిష్‌లు ఉన్న వారికి మాత్రమే ఆ రెండు ఛానెళ్ల ప్రసారాలు అందుతున్నాయి. కేబుల్ కనెక్షన్లు ఉన్న వారు మాత్రం ఈ టీవీల ప్రసారాలను వీక్షించలేకపోతున్నారు. తెలంగాణలో ఈ రెండు ఛానెళ్ల ప్రసారాలు ఆగిపోయాక దీనిపై పార్లమెంటు సాక్షిగా చర్చ కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి ప్రకాష్‌జవదేవకర్ ప్రభుత్వం-మీడియా సంబంధాలు సక్రమంగా ఉండాలని కేసీఆర్‌కు స్వయంగా సూచించారు. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఛానెళ్ల నిలిపివేతకు తనకు సంబంధం లేదని ఆయనకే తేల్చిచెప్పారు.

కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో కేసీఆర్‌కు ఎన్నో పనులు ఉన్నాయి. ఈ విషయం మోడీ దృష్టికి కూడా వెళ్లింది. అయినా కేసీఆర్ మాత్రం మెట్టు దిగిరావడం లేదు. అంటే తాను ఈ విషయంలో ఎంత మొండి పట్టుదలతో ఉన్నారో తెలుస్తోంది. ఇక తాజాగా మంగళవారం ఈ ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు చేస్తున్న నిరసన ప్రదర్శనను కూడా పోలీసులు దారుణంగా అణిచివేశారు. మహిళా జర్నలిస్టులు పోలీసుల చర్య సిగ్గు సిగ్గు, పోలీసుల దౌర్జన్యం నశించాలి, వుయ్ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తున్నా వారిని బలవంతంగానే గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వరంగల్ వెళ్లిన కేసీఆర్‌కు అక్కడ కూడా విలేకర్ల నుంచి నిరసన తప్పలేదు. 

ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఛానెళ్లు ఇప్పటికే చాలా లాస్ అయ్యాయని భవిష్యత్తులో అందులో పనిచేస్తున్న తమకు జీతాలు కూడా రావని విలేకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జోక్యం చేసుకుని ఈ రెండు ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్‌కు కూడా వీరు వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ ప్రజలకు ముల్లు గుచ్చుకుంటే కాలితో తీస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఈ రెండు ఛానెళ్లలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న తెలంగాణ ఉద్యోగుల గురించైనా ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మీడియా కూడా వ్యక్తిగత విమర్శలు, సొంత అజెండాలు పక్కనపెట్టి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే కథనాలు ప్రసారం చేయాల్సి ఉంది. ప్రజాసంక్షేమం కోసం అటు ప్రభుత్వాలు, ఇటు మీడియా బాధ్యతతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఎంతైనా ఉంది. లేకుంటే ఇలా అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.