బీజేపీ గూటికి చిరు..! మాజీ మంత్రి రాయభారం

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలో చేరాలని ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్టు తెస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిరు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నా ఆ పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించకపోవడంతో ఆయనతో పాటు కాంగ్రెస్‌లో ప్రయాణం చేసిన మాజీ మంత్రులు, ఇతర నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా చిరు సామాజికవర్గమైన కాపు సామాజిక వర్గానికే చెందిన వారు. కన్నాకు జాతీయ స్థాయి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన వాటిని మరంత పటిష్ఠం చేసుకునేందుకు తన సహచరుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట.

చిరుకు ఉన్న ఇమేజ్‌కు ఆయన బీజేపీలో చేరితో అక్కడ మంచి గౌరవం ఉంటుందని.. భవిష్యత్తులో బీజేపీకి దేశవ్యాప్తంగా తిరుగు ఉండదని.. ఏపీలో కాపు సామాజికవర్గాన్ని మొత్తం బీజేపీ వైపు మళ్లించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కన్నా చిరుకు వివరించి పార్టీ మారేందుకు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీలో ఉండే కొందరు కార్పోరేట్ లాబీయిస్ట్‌లు చిరును తేదేపాలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. మంచి భవిష్యత్తు ఇస్తామని వారు కూడా హామీ ఇస్తున్నారట. అయితే చిరు తేదేపాలోకి వెళ్లేందుకు ఎందుకో అంత ఆసక్తిగా లేరని సమాచారం. బీజేపీలో చేరితో ఏపీలో ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తే ఎప్పటికైనా చక్రం తిప్పే అవకాశం వస్తుందన్న ఆలోచనతో ఉన్నట్టు టాక్. అయితే చిరుపై ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నా ఆయన మనస్సులో ఏముందో కొద్ది రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా చిరు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.