మోడీ, చంద్రబాబుకు పవర్‌స్టార్ ప్రశంసలు..!

హదూద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆయన రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం పయనమయ్యారు. మధ్యాహ్నం రాజమండ్రికి చేరుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాటలతో కాకుండా వీలైనంత చేతలతో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దివిసీమ తర్వాత ఇదే అతి పెద్ద తుపాను అని అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాతల ముందు చూపు వల్లే తీవ్రంగా జరగాల్సిన నష్టం చాలా వరకు తగ్గిందన్నారు. ప్రధానమంత్రి మోడీ మాటమీద నిలబడే వ్యక్తి అని అందువల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చినట్టు పవన్ తెలిపారు. కేంద్రమంత్రులతో మాట్లాడి బాధితులకు మరింత సాయం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తానన్నారు. ఏదేమైనా పవన్ తానేంటో మరోసారి ఫ్రూవ్ చేసుకుని తన పని తాను చక్కబెట్టుకుంటూ అటు మోడీ, ఇటు చంద్రబాబుతో సఖ్యతగా మెలుగుతన్నాడని మనకు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.