వాళ్లంతా లఫూట్ గాళ్లు… ప్రొడ్యుసర్స్ సిండికేట్‌పై మోహన్‌బాబు ఫైర్

టాలీవుడ్‌లో ప్రొడ్యుసర్స్ సిండికేట్‌గా ఏర్పడిన కొందరు నిర్మాతలపై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనాన్షియర్లను మోసం చేసే లఫూట్‌గాళ్లు అందులో ఉన్నారని ఆయన విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.

ఈ ప్రొడ్యుసర్స్ సిండికేట్‌పై తాను త్వరలోనే ప్రెస్‌మీట్ పెడతానన్నారు. కొందరు పెద్ద నిర్మాతలు చిత్ర పరిశ్రమను బ్రష్టు పట్టిస్తున్నారని… తాను ఎప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని తెలిపారు. కాగా గతంలో ఇదే విషయమై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే మోహన్‌బాబు ప్రొడ్యుసర్స్ సిండికేట్‌కు వ్యతిరేకంగా త్వరలోనే ప్రెస్‌మీట్ పెడతానని చెప్పడంతో ఆయన ఎవ్వరి గురించి..ఏం చెపుతారా అన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.