మూడు ముక్కల్లో చెప్పాలంటే… హీరోల చిత్రమైన వ్యాపారం

ప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మాతగా కాపిటల్ ఫిల్మ్స్ వర్క్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే…’. ప్రముఖ రచయిత వెన్నెలకంటి రెండో కుమారుడు రాకేందు మౌళి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో వెంకీ మరో కథానాయకుడు. అదితి కథానాయిక. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రలు చేశారు. ఇటీవల ఈ చిత్రం పాటలు విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఎస్.పి. చరణ్ మాట్లాడుతూ – ”షూటింగ్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి, ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇక, ఈ చిత్రం కథాంశం గురించి చెప్పాలంటే… హీరోలిద్దరూ ఒక చిత్రాతిచిత్రమైన వ్యాపారం మొదలుపెడతారు. ఆ వ్యాపారం కారణంగా వీరి జీవితంలో కీలకమైన మలుపులు సంభవిస్తాయి. అవి ఎలాంటి మలుపులు? అనేది ఆసక్తికరం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. రాకేందు మౌళి మంచి రచయితగా కొనసాగుతున్నాడు. ఈ కథకు తనే యాప్ట్ అని తీసుకున్నాం. మరో హీరో వెంకీ యు ట్యూబ్ ద్వారా చాలా పాపులార్టీ సంపాదించుకున్నాడు. ‘కొలవెరి..’ పాటను మైమ్ చేసి, వెంకీ యు ట్యూబ్ లో పెడితే పది లక్షల హిట్స్ పడ్డాయి. రాకేందు మౌళి, వెంకీ అద్భుతంగా నటించారు” అని చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకురాలు మధుమిత మాట్లాడుతూ – ”ఓ మంచి కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇది. రెండు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం చేయడాన్ని సవాల్ గా తీసుకున్నాం. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ గారి చిత్రంలోని ఓ డైలాగ్ నే ఈ సినిమా టైటిల్ గా పెట్టాం. ఇది కథకు యాప్ట్ అయిన టైటిల్. మంచి  రొమాంటిక్ కామెడీ మూవీ” అని తెలిపారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, రాజా రవీంద్ర, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కార్తికేయ మూర్తి, ఎడిటింగ్: కిరణ్ గంటి, కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: మోహన్ జీ.