కేసీఆర్ క్యాబినెట్ పై క‌విత అసంతృప్తి ..తండ్రిపై అస‌హ‌నం

తెలంగాణ క్యాబినెట్‌లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంపై నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అసంతృప్తి వ్య‌క్తంచేశారు. తండ్రి కేసీఆర్‌పై తొలిసారిగా కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ అంశం త‌న‌ను కూడా బాధిస్తోంద‌ని వ్యాఖ్యానించారామె. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో జరిగిన ‘భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ’ అనే అంశంపై జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీ క్యాబినెట్ లో మ‌హిళ‌ల‌కు చోటుద‌క్క‌క‌పోవ‌డంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిలో తాను కూడా ఉన్నానని కవిత స్పష్టం చేశారు.

మహిళలకు కెసిఆర్ మంత్రివర్గంలో చోటు దక్కని అంశంపై ఫిక్కీ సభ్యురాలు సంధించిన ప్రశ్నకు కవిత పై విధంగా సమాధానం చెప్పారు. అంతేకాక ఈ అంశంపై కాస్తంత నిరాశను వ్యక్తం చేసిన కవిత క్యాబినెట్ లో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడానికి గల కారణాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు మ‌హిళా ఎమ్మెల్యేల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని, దీనికి తోడు అన్ని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా క్యాబినెట్లో చోటు ద‌క్క‌లేద‌ని పేర్కొన్నారామె! కాగా.. మెద‌క్ నుంచి ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డికి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించ‌డం మిన‌హా టీ క్యాబినెట్లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. రేఖానాయ‌క్ (ఖ‌న్‌పూర్‌), కొండా సురేఖ (వ‌రంగ‌ల్ ఈస్ట్‌), గొంగ‌డి సునీత (ఆలేర్‌), బాడిగ శోభ (చొప్ప‌దండి), కె.ల‌క్ష్మి(అసిఫాబాద్‌) తో పాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌లు అసెంబ్లీకి ఎన్నికైనా వీరికి మంత్రి ప‌దవులైతే ద‌క్క‌లేదు.