ఆ విషయమలో ఆర్నాల్డ్, ప్రభాస్ తెగ ఇష్టం – వరుణ్ తేజ్

మెగాఫ్యామిలీ నుంచి వెండి తెరకు పరిచయం అవుతున్న మరో హీరో వరుణ్‌తేజ్. నాగబాబు తనయుడిగా వరుణ్ ఈ నెల 24న ముకుందతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. ఈ సందర్భంగా వరుణ్ తో స్పెషల్ చిట్ చాట్ మీకోసం

* నటుడిగా కెమెరా ముందు తొలి అనుభవం ఎలా ఉంది?
– చాలా భయమేసింది. అయితే నటనలో శిక్షణ తీసుకోవడంతో(సత్యానంద్ వద్ద) కాస్త ధైర్యంగానే ఉన్నాను. చిన్న డైలాగ్‌తో ఫస్ట్‌సీన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షాట్ కోసం నాలుగు టేకులు తీసుకున్నా. దర్శకుడు శ్రీకాంత్ ఎక్స్‌ప్రెషన్‌తో సహా వివరించడంతో నేరుగా క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్లిపోయా.

* ముకుంద అంటే ఏంటి.. మీది శ్రీకృష్ణుడి లాంటి పాత్రా ?
– మూవీలో నా పేరు ముకుంద. అయితే ఆ పేరు ఎక్కడా వినిపించదు. ఒకసారి మాత్రం ఆ పేరుతో సైన్ చేస్తాను. శ్రీకృష్ణుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు. ఈ సినిమాలో నా పాత్ర కూడా ఆ తరహాలోనే ఉంటుంది. నాకు కామెడీ అంటే ఇష్టమైనా… దాన్ని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

* మెగా ఫ్యామిలీలో మాస్ పాత్రలే చేస్తుంటారు ? ముకుంద చూస్తే క్లాస్ మూవీలా కనిపిస్తోంది…
– మెగా ఫ్యామిలీలో ఎవ్వరు కావాలని మాస్ పాత్రలు చేయలేదు. వాళ్లకు వచ్చిన అవకాశాలను ప్రూవ్ చేసి చూపించడంతో వారికి ఆటోమేటిక్‌గా మాస్ ఇమేజ్ వచ్చింది. నేను కూడా అదే దారిలో వెళతా.

* మీలో నటుడవ్వాలనే కోరిక ఎప్పుడు పుట్టింది ?
– చిన్నప్పటి నుంచి ఉన్నా వయస్సుతో పాటే పెరుగుతూ వచ్చింది. ఆ కోరిక మనస్సులో ఉండబట్టే 122 కిలోల నుంచి 55 కేజీలకు బరువు తగ్గాను. మగధీర సినిమా టైంలో నా ఫొటోలు చూసిన పెదనాన్న నీది మంచి ఫొటోజనిక్ ఫేస్ అని కితాబివ్వడంతో నా మనసులో మాట చెప్పాను. అమ్మానాన్న కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు.

* దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎలా ఎంచుకున్నారు.
– ఆయన తొలిసారిగా వచ్చి నన్ను కావాలని నాన్నను అడిగారు. వాస్తవానికి ఓ అగ్ర నిర్మాత నన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. పూరి జగన్నాథ్‌గారు హార్ట్ఎటాక్ కథ వినిపించారు. కథ బాగుందనుకున్నా ఆ సినిమా ఫైనల్ కాలేదు. క్రిష్ కథ నచ్చినా ఆయన హిందీ గబ్బర్ షూటింగ్‌లో ఉండడం వల్ల అది కూడా కుదర్లేదు. చివరకు తొలుత అనుకున్న శ్రీకాంత్ గారే ఫైనల్ అయ్యారు.

* ముకుంద స్టిల్స్ చూస్తుంటే మీలో స్పోర్ట్స్‌మెన్ కనిపిస్తున్నాడు?
– రెగ్యులర్‌గా స్పోర్ట్స్ ఆడతా. ఏడాది పాటు టెన్నీస్ ఆడాను. రెండు సంవత్సరాలుగా వాలీబాల్ ఆడుతున్నా. ముకుందలో కూడా నేను వాలీబాల్ ప్లేయర్‌ను కావడంతో ఆ అనుభవం నాకు ఉపయోగపడింది.

* నటనలో మీకు ఇన్సిపిరేషన్ ఎవరు ?
– పెదనాన్న. ఆయన విజేత సినిమా చూసి ఏడ్చేవాడ్ని. ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్, ముఠామేస్రి చాలా సార్లు చూశా. కమల్ నటనంటే ప్రాణం, హాలీవుడ్‌లో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్, తెలుగులో ప్రభాస్ ఫైట్స్ బాగా ఇష్టం.

* పెదనాన్న చిరు.. బాబాయ్ కళ్యాణ్‌లో ఎవరు ఇష్టం?
– ఇద్దరు ఇష్టమే అయినా పెదనాన్న కాస్త ఎక్కువ ఇష్టం. వీకెండ్స్‌లో ఆయన వద్దే ఉండేవాడ్ని. ఛెర్రీ బ్రదర్, బాబాయ్ ఒకటి.. నేను పెదనాన్న ఒకటి.

* మీ ఫ్యామిలీపై వచ్చే రూమర్స్ గురించి?
– ప్రతీ కుటుంబంలో సమస్యలుంటాయి. ఆరెంజ్ సినిమా అప్పుడు నాన్న కాస్త ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు పెదనాన్న, బాబాయ్ ఇలా అందరూ ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు.

* హాబీలు?
– నైట్ కార్ డ్రైవింగ్ ఇష్టం. నైట్ కారులో రౌండ్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తాను.

* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– క్రిష్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నటిస్తాను. త్వరలోనే స్టార్ట్ అవుతాయి.  

* ఫైనల్ గా ముకుంద ఎలా ఉండబోతోంది?
– అచ్చతెలుగు సినిమాలా ఉండబోతోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.