ఈ అర‌వ‌గోల‌కు అంతం ఎప్పుడు..? న‌డిగ‌ర్ ర‌చ్చ ఈనాటిది కాదు…

ప్ర‌తీసారి గుట్టుగా జ‌రిగే మా అసోషియేష‌న్ ఎన్నిక‌లు ఈ సారి ఏ స్థాయి ర‌చ్చ లేపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం సంబంధం లేని ఈ ఎన్నిక‌లు.. ఈసారి ప్ర‌జ‌ల్లో ఎక్క‌డలేని ఆస‌క్తిని ర‌గిలించాయంటే దానికి కార‌ణం జ‌య‌సుధ‌, రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి సీనియ‌ర్ న‌టుల మ‌ధ్య జ‌రిగిన ర‌భ‌సే. ఇప్పుడు ఇలాంటి ర‌చ్చే త‌మిళ‌నాట కూడా జ‌రుగుతుంది. విశాల్, శ‌ర‌త్ కుమార్ గ్రూపుల మ‌ధ్య త‌మిళ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్ష పోటీ ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 18 న జ‌ర‌గ‌బోతున్నాయి.

గత కొన్నేళ్ల నుంచి ఏక‌గ్రీవంగా శ‌ర‌త్ కుమార్ న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నాడు. ఈయ‌న‌కు ఎదురొచ్చే ధైర్యం కూడా ఏ న‌టుడూ చేయ‌లేదు. ర‌జినీకాంత్, క‌మ‌ల్, విజ‌య్, అజిత్ లాంటి టాప్ హీరోలు ఈ ఎన్నిక‌ల్ని లైట్ తీసుకోవ‌డంతో ప్ర‌తీసారి న‌డిగ‌ర్ సంఘం ఎల‌క్ష‌న్స్ కూల్ గానే జ‌రిగాయి. కానీ ఈసారి మాత్రం శ‌ర‌త్ కుమార్ కు వ్య‌తిరేకంగా విశాల్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాడు. త‌మ‌కు ఓటేయాల‌ని న‌టుల్ని నేను కోర‌డం లేద‌నీ.. మీ మ‌న‌సుకు న‌చ్చింది చేయండంటూ అర‌వ న‌టుల్ని కోరుతున్నాడు విశాల్.

విశాల్, శ‌ర‌త్ కుమార్ మ‌ధ్య ర‌చ్చ ఈనాటిది కాదు.. మూడేళ్ల కింద ఈ స‌మ‌స్య మొద‌లైంది. ఎమ్జీఆర్ క‌ట్టించిన న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ ను శ‌ర‌త్ కుమార్ ప‌డ‌గొట్టి క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ ప్లాన్ చేసాడు. ఈ విష‌యం విశాల్ కు తెలిసి అడ్డుప‌డ్డాడు. త‌న‌తో పాటు నాజ‌ర్ లాంటి సీనియ‌ర్ న‌టుల సాయం తీసుకున్నాడు. అప్ప‌ట్నుంచీ శ‌ర‌త్ కుమార్ న‌డిగ‌ర్ సంఘానికి చేస్తున్న అక్ర‌మాల‌పై గ‌ళం విప్పుతూనే ఉన్నాడు ఈ తెలుగు హీరో. ఇప్పుడు ఆ వైరం చినికి చినికి గాలివాన‌గా మారింది. ఎన్నిక‌ల బ‌రిలో శ‌ర‌త్ కుమార్ కు ఆపోజిట్ గా నిల‌బ‌డేంత దూరం వ‌చ్చింది.

శ‌ర‌త్ కుమార్ ప్యాన‌ల్ నుంచి అధ్య‌క్ష బ‌రిలో ఉన్న‌ది కుర్ర‌హీరో శింబు. ఇప్పుడు ఈయ‌న‌ హీరో విశాల్ పై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తూ త‌మిళ నాట సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. మొన్నామ‌ధ్య కుక్క‌, న‌క్క అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు శింబు. అంతేకాదు.. నిన్న‌గాక మొన్నొచ్చిన బ‌చ్చా విశాల్.. వాడికేం తెలుసు ఇండ‌స్ట్రీ గురించి అంటూ నోటికొచ్చిన‌ట్లు రెచ్చిపోయాడు ఈ లిటిల్ సూప‌ర్ స్టార్. మ‌రోవైపు రాధిక శ‌ర‌త్ కుమార్ కూడా విశాల్ పై ఫైర్ అయింది. ఎవ‌రెన్ని ర‌కాలుగా ఒత్తిళ్లు తెస్తున్నా.. విశాల్ మాత్రం ఈ సారి ఎన్నిక‌లు జ‌రిగి తీరాల్సిందే అంటున్నాడు. తాము పోటీ నుంచి విర‌మించుకునేది లేదంటున్నాడు. మ‌రి చూడాలి.. ఈ త‌మిళ సినీ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తీసుకుంటుందో..?