నాగ‌చైత‌న్య న‌మ్మి అంత పెట్టొచ్చా..?

ఫ్లాప్ హ‌టావో.. హిట్ లావో.. ఇదే నాగ‌చైత‌న్య మంత్రం. ఏదైనా చేయండి.. కానీ నాకో హిట్ ఇవ్వండి అంటున్నాడు అక్కినేని వార‌సుడు. ఓ వైపు తొలి సినిమా అఖిల్ ఫ్లాపైనా.. ఇప్ప‌టికీ అఖిల్ పై నిర్మాత‌ల‌కు పెద్ద‌గా న‌మ్మ‌కం పోలేదు. ఆ హీరోపై ఇప్ప‌టికీ ఊ అంటే 40 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డానికి రెడీగా ఉన్నారు. కానీ హీరో అయిన ఏడేళ్ళ త‌ర్వాత కూడా 25 కోట్ల మార్క్ అందుకోడానికి నానా తంటాలు ప‌డుతున్నాడు నాగ‌చైత‌న్య‌. ఇదే ఈ కుర్ర‌హీరోని బాగా ఇబ్బంది పెడుతుంది. 

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌కే వ‌ర‌స అవ‌కాశాలు ఇస్తున్నా.. వాళ్ళు మాత్రం చైతూకి హ్యాండిస్తున్నారు. ఆ మ‌ధ్య సుధీర్ వ‌ర్మ దోచేయ్ తో ఫ్లాపిస్తే.. అంత‌కుముందు ఆటోన‌గ‌ర్ సూర్య‌తో చైతూ కొంప ముంచాడు దేవా క‌ట్టా. ఇప్పుడు ఈ హీరో మ‌ళ‌యాల బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రేమ‌మ్ రీమేక్ మ‌జ్నులో న‌టిస్తున్నాడు. చందూ మొండేటి దీనికి ద‌ర్శ‌కుడు. హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇందులో చైతూకి జోడీగా న‌టిస్తున్నారు.

మ‌జ్ను షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. కేర‌ళ‌లో ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమా త‌న కెరీర్ కు హెల్ప్ అవుతుంద‌ని కోటి ఆశ‌ల‌తో ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. దానికి త‌గ్గ‌ట్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ‌రుగుతుంది. ఆల్రెడీ హిట్ మాల్ కావ‌డంతో చైతూ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ ప్రైస్ పెట్టి మ‌జ్నును కొంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్ల మార్క్ అందుకోని చైత‌న్య‌.. మ‌జ్నుతో ప్రీ రిలీజ్ బిజినెస్సే 20 కోట్లు దాటించేస్తున్నాడు. మ‌జ్ను హిట్ అనిపించుకోవాలంటే క‌చ్చితంగా 20 కోట్ల మార్క్ అందుకోవాల్సిందే. మ‌రి చూడాలి.. క‌నీసం మ‌జ్ను అయినా చైతూని క‌రుణిస్తాడో లేడో..?