మహిళపై అత్యాచారం…జైలు గోడలు బద్దలు కొట్టి రేపిస్టును చంపేశారు

నాగాలాండ్‌లో ఓ మహిళపై అత్యాచారం చేసిన ఓ రేపిస్టును ప్రజలు బహిరంగంగా కొట్టి చంపేశారు. గురువారం దిమాపూర్‌లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని భావిస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్(35) ఇక్కడ సెకండ్ కార్ల డీలర్‌గా పని చేస్తున్నాడు. 20 సంవత్సరాల నాగా యువతిపై అతడు ఈ నెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశాడు. మరుసటి రోజు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

కోర్టు జ్యుడీషియల్ కస్టడీ కారణంగా అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నాలుగు వేల మంది భారీ ర్యాలీగా వచ్చి సెంట్రల్ జైలు గోడలు బద్దలు కొట్టి అతడిని బయటకు తీసుకువచ్చారు.

నగ్నంగా వీథుల్లో ఊరేగిస్తూ సిటీ టవర్ వరకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే పది వాహనాలకు వారు నిప్పుపెట్టారు. అక్కడ ఫరీద్‌ఖాన్‌ను అందరూ చూస్తుండగానే బహిరంగంగా కొట్టి చంపేశారు. పోలీసులు జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కర్ఫ్యూ విధించారు.