యంగ్ హీరోతో నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా చేసిన ఓం నమో వేంక‌టేశాయకు ముందు మూడు వ‌రుస హిట్లు కొట్టాడు. నాగ్ మ‌నం – సోగ్గాడే చిన్ని నాయ‌నా – ఊపిరి లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన నాగ్‌కు ఓం న‌మోం వేంక‌టేశాయ మాత్రం నిరాశ‌ప‌రిచింది. ఈ క్ర‌మంలోనే నాగ్ ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపుతున్నాడు. గ‌తంలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుతో అధిప‌తి, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో వార‌సుడు, శ్రీకాంత్‌తో నిన్నే ప్రేమిస్తా సినిమాల్లో న‌టించిన నాగ్ గ‌తేడాది కార్తీతో క‌లిసి ఊపిరి సినిమాలో చేశాడు. మ‌నం సినిమాలో త‌న ఫ్యామిలీతో క‌లిసి న‌టించాడు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రాజుగారి గ‌ది 2 సినిమాలోను ఒక‌రిద్ద‌రు యంగ్ హీరోల‌తోను క‌లిసి న‌టించాడు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెట్స్‌మీద ఉండ‌గానే ఇప్పుడు మ‌రో యంగ్ హీరోతో మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు నాగ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో వ‌రుస‌గా హిట్లు మీద హిట్లు కొడుతున్న యంగ్ హీరోల‌లో నిఖిల్ ఒక‌డు.

ప్ర‌స్తుతం కేశ‌వ సినిమాలో న‌టిస్తోన్న నిఖిల్ ఈ సినిమా త‌ర్వాత నాగ్‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్నాడ‌ట‌. గ‌తంలో త‌న‌కు కార్తీకేయ లాంటి హిట్‌తో పాటు అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌కు ప్రేమ‌మ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన చందూ మొండేటి ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నాడు.

తాజాగా చందు చెప్పిన క‌థ నాగ్‌ను బాగా ఇంప్రెస్ చేసింద‌ట‌. నాగ్ ఓకే చెప్ప‌డంతో మ‌ల్టీస్టార‌ర్‌కు లైన్ క్లీయ‌ర్ అయ్యింది. ఇందులో ఓ కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారని చెబుతున్నారు. ఏప్రిల్ లో ఈ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.