నాగ‌శౌర్య‌ ర‌ప్ఫాడిస్తున్నాడు

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంచి సాఫ్ట్ డైరెక్ట‌ర్స్ లో శ్రీ‌నివాస్ అస‌వ‌రాల కూడా ఒక‌రు. హిట్లు ఉన్నాయి క‌దా అని వ‌ర‌స సినిమాలు చేయ‌డు ఈయ‌న‌. నెమ్మ‌దిగా నింపాదిగా ఒక్కో సినిమా చేస్తుంటాడు. మూడేళ్ల‌కో సినిమా కూడా చేయ‌డం గ‌గ‌న‌మే. అప్ప‌ట్లో నాగసౌర్య హీరోగా ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు ఈయ‌న‌. ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాతోనే రాశీఖ‌న్నా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. అదొచ్చిన రెండేళ్ల‌కు నాగ‌శౌర్య‌, నారా రోహిత్ హీరోలుగా జ్యో అచ్చుతానంద సినిమా తెర‌కెక్కించాడు శ్రీ‌నివాస్. ఈ సినిమా కూడా హిట్ అయింది. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌. ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ మూడో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మూడోసారి కూడా నాగ‌శౌర్య‌తోనే వెళ్తున్నాడు ఈయ‌న‌. ఈయ‌న‌కు తోడు సినిమాలో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మాళవిక నాయర్ ను తీసుకున్నాడు శ్రీనివాస్ అవసరాల.

ఇక ఇప్పుడు మూడో సినిమాకు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనికి ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ అని టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇంకా విచిత్రం ఏంటంటే చాలా సైలెంట్ గా ఈ చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌డం.. రెండు షెడ్యూల్స్ కూడా పూర్తైపోయాయ‌ని చెప్ప‌డం. ఆగ‌స్ట్ నుంచి మూడో షెడ్యూల్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ‌శౌర్య‌, మాళ‌విక నందిని రెడ్డి తెర‌కెక్కించిన ‘కళ్యాణ వైభోగమే’లో న‌టించారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం కొత్త ద‌ర్శ‌కుడితో అశ్వద్ధామ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు సుమంత్ తో సుబ్రమణ్యపురం తెర‌కెక్కించిన సంతోష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో ‘పార్థు’ అనే సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి వ‌ర‌స సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తున్నాడు నాగ‌శౌర్య‌.