నానికి బాగా పెరిగిందండోయ్..!

నాని సినిమా అంటే ఇదివ‌ర‌కు ఉన్న అంచ‌నాలు వేరు.. ఇప్పుడు ఉండాల్సిన అంచ‌నాలు వేరు. మ‌నోడిప్పుడు స్టార్ హీరో. అంతే త‌గ్గేది లేద‌స‌లు. కావాలంటే తాజాగా హ‌న్మ‌కొండలో జ‌రిగిన ఎంసిఏ ఈవెంట్ చూస్తే అర్థ‌మైపోతుంది. స్టార్ హీరోల సినిమాల మాదిరే అక్క‌డ ఘ‌నంగా జ‌రిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్. నానితో పాటు చిత్ర‌యూనిట్ అంతా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అంతేకాదు.. రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ వేడుక‌కు వ‌చ్చారు. ఇక నాని.. నాని అంటూ స్టేడియం అభిమానుల కేరింత‌లతో మారుమోగిపోతుంది. ఎర్ర‌వ‌ల్లి ద‌యాక‌ర‌రావ్ లాంటి వాళ్లు కూడా వ‌చ్చారు ఈ వేడుక్కి. నాని మాట్లాడుతూ త‌మ‌కు వ‌రంగ‌ల్ లో అందించిన స‌పోర్ట్ కు అక్క‌డి ప్రేక్ష‌కులంద‌రికీ ధ‌న్యావాదాలు తెలిపాడు. ముఖ్యంగా అక్క‌డ షూటింగ్ ఎన్ని రోజులు జ‌రిగితే అన్ని రోజులు సాయం చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్ కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞతలు తెలిపాడు న్యాచుర‌ల్ స్టార్. 

ఇక సాయిప‌ల్ల‌వి కూడా చీర‌క‌ట్టిన చంద‌మామ‌లా వేడుక‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. దానికితోడు అంత‌కంటే అంద‌మైన ముద్దుముద్దు తెలుగు మాట‌ల‌తో ప‌డ‌గొట్టింది. అంద‌రి గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడింది. నాని గురించి మాట్లాడుతూ ఆయ‌న హార్డ్ వ‌ర్క‌ర్ అని.. మ‌రోసారి న‌టించ‌డానికి వేచి చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. నిర్మాత దిల్ రాజు ఎంసిఏ గురించి మాట్లాడుతూ.. ఇది ప్ర‌తీ ఇంటి సినిమా క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ త‌న రాకింగ్ ప‌ర్ఫార్మెన్స్ తో స్టేజ్ ను ఊపేసాడు. మొత్తానికి వేడుక అయితే క‌న్నుల పండ‌గ‌గా జ‌రిగింది.