నేను శైలజ మూవీ రివ్యూ

తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రేమ కథలే ప్రధాన ఆస్తి. అయితే ఆ ప్రేమ కథను ఎంత హృద్యంగా అందంగా చూపిస్తామన్నదే అసలు సిసలు పరీక్ష. ప్రతీ ప్రేమ కథ గొప్పదే. కానీ దర్శకుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీస్తాడా లేదా అన్నదే అసలు ప్రశ్న. అలాంటి ప్రశ్నల నుంచే ఎన్నో కథలు… ఎన్నో సన్నివేశాలు పుట్టుకొస్తాయి. దర్శకుడు కిషోర్ తీరుమల కూడా రామ్ కోసం అద్భుతమైన కథ రెడీ చేశాడనే ప్రీ రిలీజ్ టాక్ తెచ్చుకోగలిగాడు. అసలే ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఈసారి ఎలాంటి కథ ఎంచుకున్నాడా అనే అనుమానాలు కూడా బోలెడున్నాయి. అయితే ట్రైలర్ తో దర్శకుడు…అందులో పెర్ పార్మెన్స్ తో రామ్ పాస్ మార్కులు తెచ్చుకున్నారు. మరి అలాంటి రామ్ శైలజ తో కలిసి నడిపించిన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.

ఓ అమ్మాయిని రామ్ ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం నేను నిన్ను అలా చూడలేదంటుంది. దానికి ప్రత్యేక కారణముంటుంది. ఆ కారణాలు మాత్రం థియేటర్లోనే చూడాలి. ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి హీరో ఏం చేశాడన్నదే కథ. వినడానికి చాలా సింపుల్ గా రెగ్యులర్ గా ఉంది కదా. దర్శకుడు కథను సింపుల్ గానే రాసుకున్నాడు. కానీ సన్నివేశాల పరంగా స్ట్రాంగ్ గా రాసుకున్నాడు.

తండ్రి ప్రేమను కోల్పోయిన ఓ అమ్మాయి… స్నేహితుడి ప్రేమను పొందుతుంది. ఆ స్నేహం ప్రేమగా మారినా తొందరపడి చెప్పలేదు. ఎందుకంటే… కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలే కారణం. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేని పాత్రలో హీరో రామ్ చాలా బాగా నటించాడు. రెగ్యులర్ గా చేసే మాస్ పాత్రలనుంచి రిలీఫ్ కలిగించాడు. ఎక్కువ హడావిడి చేయకుండా… పిచ్చి పిచ్చి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా… పాత్రకు ఎంత అవసరమే అంతే నటించాడు. భావోద్వేగమైన సీన్స్ కూడా బాగా చేశాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. దర్శకుడు ఫస్టాఫ్ లో లవ్ సీన్స్ తో నడిపించాడు. సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నడిపించాడు. కథ చాలా నార్మల్ గా ఉంటుంది. చిన్నప్పటి రింగు స్టోరీ… పెళ్లిలో హీరో చూపించే వీడియోతో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా రూపొందించాడు. అలాగే ప్రిన్స్, రామ్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ ప్లాన్ చేసుకున్నాడు.

ఓవరాల్ గా ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. కిషోర్ తిరుమల ప్రతీ ఫ్రేమ్ ను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. ముఖ్యంగా సత్యరాజ్ తో తండ్రి పెయిన్ ను చక్కగా చూపించాడు.
డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నాడు. ఆడపిల్లని పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపాలనేది ఎవడు రాశాడో కానీ… ఖచ్చితంగా వాడికి కూతురు ఉండి ఉండదు అనే డైలాగ్స్ కు విజిల్స్ పడతాయి. తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమను… బాగా ఆవిష్కరించాడు. అయితే సినిమా ఆద్యంతం మెప్పించడంలో కిషోర్ విఫలమయ్యాడు. ఎంటర్ టైన్ మెంట్ విషయంలో… చిన్న చిన్న స్మైలీస్ ఆడియెన్స్ నుంచి వచ్చినా… కడుపుబ్బ నవ్వేంత కామెడీ మాత్రం లేదనే చెప్పాలి. అలాంటి ఓ నాలుగైదు సీన్స్ పడి ఉంటే అద్భుతంగా ఉండేది. ప్రదీప్ రావత్ తో కామెడీ చేయించాలనుకొని సక్సెస్ అయ్యాడు కిషోర్. టెక్నికల్ గా దేవిశ్రీ ప్రసాద్ రీరికార్డింగ్ ప్రాణం పోసింది. కిషోర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఆడియెన్స్ ను కనెక్ట్ అయ్యేలా రీ రికార్డింగ్ చేసాడు.

ఫైనల్ గా… లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చాలా వస్తున్నాయి… కానీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలా ఫ్యామిలీ ఎమోషనల్ ఎటాచ్ మెంట్స్ ని బాగా చూపించిన నేను శైలజ చిత్రాన్ని కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడొచ్చు.

PB Rating : 3.25/5