ఇసుక మాఫియా: బాల‌య్య ఇంటిముందు ఎడ్ల‌బండ్ల‌తో నిర‌స‌న‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు, అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటిముందు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఊహించ‌ని విధంగా నిర‌స‌న తెలిపారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాసనకోట గ్రామస్తులు బాలయ్య ఇంటి ముందు ఎడ్లబండ్లతో నిరసనకు దిగారు. తాము మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇసుక తెచ్చుకుంటుంటే పోలీసులు అడ్డుకుని వేధింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనకోట వద్ద పెన్నా నది నుండి రోజూ పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని. ఆ విషయం పట్టించుకోకుండా పోలీసులు తమను వేధిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కొంత‌మంది ఇసుకుమాఫియాదారులు న‌కిలీ చ‌లానాలు చూపించి వాటితో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ జోక్యం చేసుకుని తమకు న్యాయం చెయ్యాలని గ్రామస్థులు విన్నవించారు. మ‌రి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు చేప‌ట్టిన వినూత్న నిర‌స‌న‌కు బాల‌య్య ఎలా స్పందిస్తారో చూడాలి.