ఏపీలో మ‌రో కొత్త పార్టీ..!

స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లోగ‌త నాలుగు ద‌శాబ్దాలుగా చూసుకుంటే జాతీయ‌పార్టీ కాంగ్రెస్‌కు ధీటుగా ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, తెరాస మాత్ర‌మే ఎదిగాయి. త‌ర్వాత కాస్తో కూస్తో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమారుడు జ‌గ‌న్ ఏర్పాటు చేసిన వైకాపా ఏపీలో అన‌తికాలంలో మంచి సీట్లు సాధించి ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఈ నాలుగు ద‌శాబ్దాల్లో పేరున్న వ్య‌క్తులు ఎన్నో పార్టీల‌ను పెట్టినా అవేమి నిల‌బ‌డ‌లేక‌పోయాయి. టీడీపీలోనే అన్న టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ రెండు పుట్టుకొచ్చి మ‌టుమాయ‌మ‌య్యాయి. ఇక తెలంగాణ‌లో విజ‌య‌శాంతి లాంటి సినిమా న‌టి త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెరాస‌లో క‌లిపేశారు. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్ర‌జారాజ్యం కేవ‌లం 2009 ఎన్నిక‌ల్లోనే పోటీ చేసి త‌ర్వాత కాంగ్రెస్‌లో విలీన‌మైపోయింది.

ఇక రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా క‌నుమ‌రుగైపోగా… తెలంగాణ‌లో ఉన్నామంటే ఉన్నాం అన్న‌ట్టుగా ఉంది. అయితే తాజాగా ఏపీలో మ‌రో కొత్త పార్టీ ఆవిర్భ‌వించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. రెండు రోజుల క్రితం విశాఖపట్నం లో విలేకరులతో మాట్లాడిన అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంద‌ని…. సమైక్యాంధ్ర‌కోసం చిత్త‌శుద్ధితో పోరాడిన నేత‌లు రాష్ట్రంలో కొత్త పార్టీ నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మ‌రో 8 నెల‌ల పాటు వేచి చూసి త‌ర్వాత తాము కొత్త పార్టీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర విభజనకు సహకరించిన స్వార్ధపరులంతా ఇప్పుడు ముసుగు వేసుకుని కొత్త పార్టీల పేరుతో జనంలోకి వస్తున్నారని …మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు వ‌స్తున్న అలాంటి నేత‌ల‌ను ప్ర‌జ‌లు అడ్డుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఏదేమైనా స‌బ్బంహ‌రి కామెంట్ల‌తో ఏపీలో మ‌రో కొత్త పార్టీ ఏర్పాటు కానుంద‌న్న చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.