హోరాహోరీ పోరులో న్యూజిలాండ్ విన్..వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విన్

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆథిధ్య దేశాలు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మ«ధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని తలపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విన్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 32.2 ఓవర్లలో 151 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. 

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనఫ్‌ను న్యూజిలాండ్ బౌలర్లు దారుణంగా పతనం చేశారు. ఆస్ట్రేలియాలో బ్రాడ్ హడ్డిన్ 43, వార్నర్ 34, వాట్సన్ 23 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 5 వికెట్లు, వెటోరీ 2, సౌథీ 2 వికెట్లు తీశారు. ఒకానొక దశలో 106 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను బ్రాడ్ హడ్డిన్-కమిన్స్ చివరి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకోవడంతో ఆసీస్ 150 పరుగుల మార్క్‌ను దాటింది.

152 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చివరి వికెట్‌కు విజయం సాధించింది. ఓపెనర్, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి 50 పరుగులు సాధించడంతో న్యూజిలాండ్ సులువుగానే విజయం సాధించేలా కనిపించింది. అయితే తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆండర్సన్ 26 పరుగులు చేసి ఔట్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరకు కేన్ విలియమ్సన్ 45 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు, కమిన్స్, మాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు. ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.