ఎక్స్‌క్లూజివ్…నూజివీడు ఫ్లాట్స్‌కు హాట్ హాట్ రేట్..

కృష్ణా జిల్లాల్లో ఓ మూలగా ఎక్కడో విసిరేసినట్టు ఉండే ఊరు నూజివీడు. నిన్నటి వరకు ఇది కేవలం మామిడిపండ్ల ఉత్పత్తి కేంద్రంగానే ప్రసిద్ధి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే అందరి దృష్టి నూజివీడుపై పడింది. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే నూజివీడు ఉంది. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు ప్రకటన వెలువడగానే అందరి దృష్టి నూజివీడుపై పడడానికి ఇక్కడ ఉన్న భూముల లభ్యతే కారణం. విజయవాడ -గుంటూరు మధ్యలో తీసుకుంటే భూముల లభ్యత చాలా తక్కువగా ఉంది. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు 1800 ఎకరాలు ఉన్నాయి. 

ఇక నూజివీడు సమీపంలో గొల్లపల్లి రఘనాథస్వామి దేవాలయ భూములు 3600 ఎకరాలు ఉన్నాయి. పశ్చిమగోదావరికి ఆనుకుని ఉన్న కాట్రేనిపాడు రిజర్వ్‌ఫారెస్ట్ భూములు 6000 ఎకరాల వరకు ఉన్నాయి. వీటితో పాటు పక్కనే హనుమాన్‌ జంక్షన్ ప్రాంతంలో కూడా అటవీభూములు అధికంగా ఉన్నాయి. హనుమాన్‌జంక్షన్ వద్ద మల్లవల్లి అటవీ భూములు మరో 1500 ఎకరాలు ఉన్నాయి. గన్నవరం వెటర్నరీ కళాశాల వద్ద కూడా 120 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నూజివీడు సమీపంలోనే దాదాపుగా 16000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక ఇదే భూముల మధ్యలోనుంచి పోలవరం-ప్రకాశం బ్యారేజీ లింక్ కెనాల్ కూడా వెళుతోంది. ఆగిరిపల్లి మండలంలో 1500 ఎకరాల్లో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు కూడా ఉంది. నీటి వనరులకు కొరతే లేదు. ఇక ఇదే ప్రాంతం మధ్యలోనుంచి కలకత్తా-మద్రాసును కలిపే 24వ నెంబర్ జాతీయరహదారితో పాటు తెలంగాణ-ఏపీ ప్రాంతాలను కలిపే కల్లూరు-మచిలీపట్నం జాతీయరహదారి, విజయవాడ-జగదల్‌పూర్(ఛత్తీస్‌ఘడ్) రహదారులు కూడా సమీపంగానే వెళుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అత్యంత అనువుగా ఉంది. ఇంకా రాజధాని విస్తరించు కోవాలంటే పశ్చిమగోదావరి జిల్లాలో కావాల్సినంత మెట్ట భూములు కూడా అందుబాటులో ఉన్నాయి.

అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో ఉన్న అడవినెక్కలం వద్ద ఉన్న అటవీ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక్కడికి సమీపంలో కనీసం నాలుగైదు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ అటవీ భూమికి ఆనుకునే మద్రాస్-కలకత్తా రైల్వేమార్గం కూడా వెళుతోంది. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండనే ఉంది. దీనిని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దనున్నారు. చంద్రబాబు అనుకున్నట్టుగా అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి కావాల్సినంత భూమి విజయవాడకు దగ్గర్లో ఇక్కడ మాత్రమే ఉంది. రాజధాని ప్రకటన ఊహాగానాలు వెలువడుతున్నప్పటి నుంచే నూజివీడు, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల వరకు అక్కడ ఎకరం రూ.10-15 లక్షల మధ్య ఉందంటేనే గొప్ప. ఇప్పుడు పొలాల రేట్లు కూడా ఎకరం రూ.65 లక్షల నుంచి కోటికి చేరుకున్నాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.