ఎన్ టీవీకి ఆంధ్రప్రదేశ్ లో సంకెళ్లు.. ప్రసారాల నిలిపివేత… నోటుకు ఓటు ఎఫెక్ట్

ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్ టీవీ ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ లో ఆగిపోయాయా… అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు దేశం పార్టీకి చెందిన వార్తలు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నారనే కారణంతో… ఎం ఎస్ ఓలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు సరిగ్గా రాకుండా నిలిపివేశారని ఎన్ టీ వీ ఆరోపిస్తోంది. దీని వెనక చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ హస్తం ఉందనేది వారి వాదన. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో పసుపు దళం బాగా హర్ట్ అయ్యిందట. అందుకే ఎన్ టీ ప్రసారాలు రాకుండా అడ్డుకుంటున్నారట.

నిజానికి ఓటుకు నోటు కేసు విషయంలో ఒకట్రెండు తప్ప అన్ని ఛానళ్లు బాగా కవర్ చేశాయి. ఆ తర్వాత చంద్రబాబు, కెసిఆర్ మాటల యుద్ధం జరిగింది. దీంతో న్యూస్ ఛానెల్స్ లో ఓ రెండు వారాల పాటు దీని గురించే చర్చ జోరుగా జరిగింది. అయితే ఎన్ టీవీ ప్రసారాలు సడన్ గా ఆపేయడంపై మీడియా వర్గాలు గుర్రుమంటున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్యూలో వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి చూపించడంలో తప్పేముందని జర్నలిస్టులు వాదిస్తున్నారు. అన్ని ఛానల్స్ చేసినట్టుగానే ఎన్ టీవీ కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. చినబాబుకు ఇవే నచ్చలేదట.  

ఏది ఏమైనా ఆల్రెడీ నోటుకు ఓటు కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఫోన్ సంభాషణతో చంద్రబాబు సైతం చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో మీడియాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలని మీడియా వర్గాలంటున్నాయి.