అధికారులే హీరోలు అండ్ విల‌న్లూ..

రాజ‌కీయ క్రీడ‌లో అధికారం ఉన్న‌న్నాళ్లూ.. నాయ‌కులు చెప్పిందే వేదం. వారు చేసేదే చ‌ట్టం. న‌చ్చినొడు ఉంటాడు.. న‌చ్చ‌నోడు ఎక్క‌డో మూలుగుతుంటాడు.. ఇంకా చెప్పాలంటే వ‌ల్ల‌కాద‌న్న‌వారే వ‌ల్ల‌కాటికి పోతారు. ఈ చ‌ద‌రంగంలో అధికారులే పావులు. వారిని అడ్డుపెట్టుకుని ఎత్తులు.. పైఎత్తులు వేస్తూ జిత్తుల‌మారితనం నెరపేది. నాయ‌కులే! తాజాగా ఓటుకు నోటు కేసులో జ‌రుగుతున్న‌దిదే!

తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ఉన్న‌ట్టుండి హీరో అయిపోయినా, రేప‌టి వేళ అత‌డే జీరో అయిపోయినా హ‌శ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ఇవాళ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీఅధికార ప‌క్షం క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయి. అదేవిధంగా ఏపీ సీట్ ను మున్ముందుకు న‌డిపించే ఇక్బాల్ కూడా టీడీపీవారికి హీరోనే! కానీ.. ప్ర‌భుత్వం మారినా.. మ‌రొక‌టో / ఇంకొక‌టో జ‌రిగినా అత‌డి ప‌రిస్థితే ప్ర‌శ్నార్థ‌కం. జ‌గ‌న్ కేసులోనూ జ‌రిగిందిదే! అప్ప‌ట్లో సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆకాశానికి ఎత్తేసింది విప‌క్షం. అంతేనా! ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తి ఊరిలోనూ  ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ త‌రువాత అత‌డికి ఏడాది పాటు పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఎంత‌గా న‌ర‌కం చూపార‌ని? అదేవిధంగా రేప‌టి వేళ ఏకేఖాన్‌, ఇక్బాల్ కూడా స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుపోవ‌చ్చు. సో.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప‌గ రాజ‌కీయ‌నాయకుల‌ది.. ప్ర‌తీకారం మాత్రం అధికారుల‌ది. ఇంతే! ఇంతింతే!
ఆలోచిస్తే అంతా ఇంతింతే!