ఊల్లాల ఊల్లాల టీజర్ లాంచ్ చేసిన సైరా సురేందర్ రెడ్డి

నటరాజ్‌, నూరిన్‌, అంకిత హీరోహీరోయిన్లుగా సత్య ప్రకాష్‌ దర్శకత్వంలో సుఖీభవ క్రియేషన్స్‌ పతాకంపై ఏ.గురురాజ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ బుధవారం వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి టీజర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సత్యప్రకాష్‌తో నాకు 12ఏండ్లుగా అనుబంధం ఉంది. నాకిష్టమైన వ్యక్తి. మంచి ఆర్టిస్టు. మా అసోసియేషన్‌లో మూడు చిత్రాలు చేశాం. ఆయన దర్శకుడిగా మారుతూ వాళ్ళబ్బాయి హీరోగా ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావాలి. నిర్మాత గురురాజ్‌ ఇంకా పెద్దపెద్ద సినిమాలు చేయాలి. జారు రాయరాల అందించిన సంగీతం చాలా బాగుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు. ‘ఈ కార్యక్రమం కోసం శ్రీకాకుళం నుంచి వచ్చాను. అక్కడ్నుంచి సినిమా సూపర్‌ హిట్‌ కావాలని కోరుకున్నాను. ఈ టీజర్‌ విడుదలకు సురేందర్‌ రెడ్డి రావడం ఎంతో ఆనందంగా ఉంది’ అని చిత్ర దర్శకుడు సత్యప్రకాష్‌ తెలిపారు. నిర్మాత గురురాజ్‌ చెబుతూ, ‘నూరిన్‌కిది తెలుగులో మొదటి సినిమా. తను అద్భుతంగా నటించింది. మరో హీరోయిన్‌ అంకిత చక్కగా నటించింది. నటరాజ్‌ అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. సత్య ప్రకాష్‌ మంచి కథని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన టేకింగ్‌ కొత్తగా ఉంటుంది. శేఖర్‌ మాస్టర్‌ డాన్సులు, కాసర్ల శ్యామ్‌ పాటలు ఆకట్టుకుంటాయి. మా బ్యానర్‌లో ఇది నాలుగో సినిమా. కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. త్వరలో ట్రైలర్‌, పాటలను విడుదల చేస్తాం’ అని చెప్పారు.
‘ఈ సినిమాకి నాన్న సత్యప్రకాష్‌, నిర్మాత గురురాజ్‌ రెండు కళ్లు. అంకిత, నూరిన్‌ అద్భుతంగా నటించారు. ‘సైరా’ సురేందర్‌రెడ్డి టీజర్‌ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో నటరాజ్‌ తెలిపారు. సంగీత దర్శకుడు జారు చెబుతూ, ‘ఈ సినిమాకి నన్ను ఎంపిక చేసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. నాలుగు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. నటరాజ్‌ సూపర్‌గా నటించాడు. ఆకట్టుకునే సినిమా అవుతుంది’ అని అన్నారు.