ఊపిరి మూవీ రివ్యూ

అల్లరి చిల్లరగా తిరిగే ఓ దొంగ… కాళ్లు చేతులు చచ్చుపడిన ఓ బిలియనర్ తో కలిసి చేసే జర్నీనే ఊపిరి. అలాంటి బిలియనియర్ కు కేర్ టేకర్ గా జాయిన్ అయిన ఆ దొంగ అందరి మనసుల్ని ఎలా దోచుకున్నాడనేదే ఊపిరి. అలా అందరి మనసుల్ని దోచుకున్న ఆ దొంగ అమ్మ మనసుకు

మాత్రం దూరమెందుకయ్యాడనేదే ఊపిరి కథ. ఓ మనిషి ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తాడు.. ఓ మనిషితో మరో మనిషి స్నేహం జీవితాన్ని ఎలా మారుస్తుందనేదే ఊపిరి కథ. ఇది మన తెలుగు కథ కాదు. కానీ ఎమోషన్స్ ప్రపంచంలో ఏమనిషికైనా ఒకేలా ఉంటాయని చెప్పేదే ఊపిరి కథ. ది ఇన్ టచబుల్స్ అనే ఫ్రెంచి చిత్రాన్ని ఊపిరిగా రీమేక్ చేశారు. కాదు రైట్స్ తీసుకొని తెలుగు, తమిళ భాషల్లో చాలా మార్పులు చేసారు. అదే ఊపిరి. దర్శకుడు వంశీ పైడి పల్లి. అదేంటి ఈయన మాస్ డైరెక్టర్ కదా అనకండి… దర్శకుడన్నాక అన్ని సినిమాలు చేయాలి అదే చేశాడు వంశీ. ఈ తరహా ఎమోషనల్ స్టోరీస్ కు పర్ ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతమందించాడు. ఈ తరహా కథల్ని మరింత అద్భుతంగా చూపించగల సమర్థుడు పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫి అందించాడు. ఈ మధ్య వరుసగా తనదైన డైలాగ్స్ తో ఊపుమీదున్నాడు అబ్బురి రవి మాటలు. క్షణం లాంటి చిన్ని చిత్రంతో సూపర్ హిట్ అదుకున్న బడా నిర్మాత పివిపి ఈ చిత్రానికి నిర్మాత. మరి ఇన్ని హంగుల నడుమ ఓ ఫ్రెంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం ఎలాంటి మార్పులు చేసి ఏ విధంగా ఎంటర్ టైన్ చేశారు మరి….

ఫ్రెంచ్ చిత్రాన్ని పక్కన పెట్టేద్దాం… ఊపిరి గురించి మాట్లాడుకుంటే… ఫస్ట్ పర్ ఫెక్ట్ క్యాస్టింగ్. చూడగానే బిలియనియర్ అనిపించే నాగార్జున. పక్కింటి సాధారణ కుర్రాడిగా ఇట్టే కనెక్ట్ అయ్యే కార్తి, గ్లామర్ గా తెల్లగా అందంగా ఉండే పిఏగా తమన్నాను ఎంచుకొని దర్శకుడు చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే నాగార్జునకు చేతులు కదలవు, నడవలేడు.. కానీ కథను నడిపించాలి. స్పర్శ ఉండదు కానీ ప్రేక్షకుల్ని తనదైన హావబావాలతో స్పృశించాలి. అవన్నీ చేయగల సమర్థత నాగ్ లో ఉంది. వంశీ నమ్మకాన్ని నాగ్ నిలబెట్టాడు. పాత్రకు ఊపిరి పోశాడు. తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైనా… కథకు ఊపిరి అందించాడు.

ఇక కార్తి క్యారెక్టర్ సినిమాకే హైలైట్. ఎందుకంటే… ఆద్యంతం నవ్వించింది కార్తీనే. తనదైన వింత చేష్టలతో.. ఊహించని పనులతో నవ్వించగలిగాడు. సింపుల్ యాక్టింగ్ తో… బెస్ట్ డైలాగ్ డెలివరీతో అన్నయ్యా అంటూ… ఆటపట్టిస్తూ… అలరించాడు. ఎంతగా నవ్వించాడో అంతగా… ఎమోషన్స్ ని పండించాడు. ముఖ్యంగా పెయింటింగ్ సీన్స్ లో అదరగొట్టాడు. తమన్నా పిఎ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయింది. ప్రకాష్ రాజ్ కు ఓ మంచి క్యారెక్టర్ దొరికింది. తనికెళ్ల భరణి, జయసుధ, ప్రవీణ్, ఆలీ కి అలవాటైన పాత్రల్లో కనిపించారు. ఇక అనుష్క, అడవి శేష్, శ్రియా సరసన స్పెషల్ అప్పీయరెన్స్ లో కనిపించారు.

సాంకేతికంగా గోపిసుందర్ బాగా ప్లస్ అయ్యాడు. రీ రికార్డింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా నాగ్ కార్తి మధ్య వచ్చేసన్నివేశాల్ని బాగా హైలైట్ చేశాడు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫి సినిమాకు కొత్త కలరింగ్ ఇచ్చాడు. చాలా రిచ్ ట్రీట్ మెంట్ చూపించాడు. అబ్బూరి రవి డైలాగ్స్ అదిరిపోయాయి. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ పండాలంటే డైలాగ్స్ బాగుండాలి. ఆ విషయంలో అబ్బురి రవి సక్సెస్ అయ్యాడు. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా రిచ్ నెస్ తగ్గనీయలేదు.

ఈ తరహా చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. రీమేక్ చిత్రాలు చాలా వరకు పరాజయాలందుకుంటాయి. అయితే ఓ రీమేక్ చిత్రాన్ని పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే ఎలా హిట్ కొట్టోచ్చో చూపించిన చిత్రమిది. ఈ విషయంలో దర్శకుడు వంశీ పైడి పల్లి సక్సెస్ అయ్యాడు. అందునా మాస్ కమర్షియల్ చిత్రాల్ని ఇప్పటివరకు తీసిన వంశీ పైడిపల్లి ఈ తరహా భావోద్వేగమైన చిత్రం తీయడం నిజంగా అభినందనీయం. చాలా చోట్ల ఏడిపించాడు. నవ్వించాడు. ఆలోచింపచేశాడు. ప్రెంచి ఫిల్మ్ నుంచి సన్నివేశాల్ని తీసుకున్నప్పటికీ.. మంచి డైలాగ్స్ తో ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ పార్మెన్స్ రాబట్టుకోగలిగారు. సెకండాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని బోరింగ్ సీన్స్ పడ్డాయి. కథ లేకపోవడంతో కొన్ని సీన్స్ ప్రత్యేకంగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కార్ చేజ్ సీన్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇంగ్లిష్ అమ్మాయితో నాగ్ లవ్ లోకి దింపే సీన్ జస్ట్ ఓకే. ఆ తర్వాత బర్త్ డే సీన్ బాగుంది.

చిట్టచివరిగా… నాగార్జున కార్తి సినిమాకు ప్రాణం పోశారు. ఊపిరినిచ్చారు. చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రం ఊపిరి. ఎందుకంటే ఊపిరి లాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావు. మళ్లీ మళ్లీ తీయలేరు. ఇంత గ్రాండ్ సెటప్ మళ్లీ కుదరవు…సో గో అండ్ వాచ్.

PB Rating 3.5/5