ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ రివ్యూ

ఆది సాయికుమార్ ఎప్పటినుంచో ఓమంచి హిట్ కొట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. అలాగే సాయి కిరణ్ అడవి మంచి హిట్స్ కొట్టాడు. ఈసారి కమర్షియల్ భారీ హిట్ అందుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఆవిధంగా ప్రారంభమైందే ఆపరేషన్ గోల్డ్ ఫిష్. కాశ్మీర్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఏయిర్ టెల్ యాడ్ తో అందరికీ పరిచయమైన శషా చెట్రి ఇందులో ఓ హీరోయిన్ గా నటించింది. అలాగే నిత్యానరేష్ మరో హీరోయిన్. కార్తీక్ రాజు, నూకరాజు ముఖ్యపాత్రలు కాగా… మాటల రచయితగా సుపరిచితమైన అబ్బూరి రవి ఇందులో విలన్ గా నటించాడు. నటుడు మనోజ్ నందం సైతం టెర్రరిస్ట్ పాత్ర పోషించాడు. మరి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే….

అర్జున్ (ఆది సాయి కుమార్) ఎన్.ఎస్.జి. కమాండో. కరడు గట్టిన టెర్రరిస్ట్ ఘాజీ బాబా (అబ్బూరి రవి) పట్టుకునే క్రమంలో కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటాడు. దీంతో తన అధికారులకు అసలు ఏం జరిగిందో వివరించే విధానంలో కథ నడుస్తుంది. ఘాజీ బాబాను అర్జున్ పట్టుకుంటాడు. కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. కానీ తనను ఏం చేయలేరనే ధీమా ఘాజీ బాబాలో కనిపిస్తుంది. కారణం… ఫారూఖ్ (మనోజ్ నందం). పాకిస్తానీ టెర్రరిస్ట్ ఫారూఖ్… మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేసి ఘాజీ బాబాను విడిపించాలనే స్కెచ్ వేస్తాడు. మినిస్టర్ కూతురుకు త్రెట్ ఉంటుంది. ఆమెను రక్షించే బాధ్యతను అర్జున్ తీసుకుంటాడు. కార్తీక్ రాజు తాన్యను ఇష్టపడతాడు. అలాగే సోలమన్ (నూకరాజు) కూడా తాన్యను ఇష్టపడాతు. కానీ నిత్య కార్తీక్ ను ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భంలో వారి లవ్ మ్యాటర్ తేల్చుకునేందుకు ఔటింగ్ కు వెళ్తారు. వారి ఆచూకి తెలుసుకొని ఫారూఖ్ కిడ్నాప్ చేస్తాడు. వారి కిడ్నాప్ ను అడ్డం పెట్టుకొని ఘాజీ బాబా ఉరిశిక్ష ను తప్పించుకుంటాడు. ఇదే సందర్భంలో అర్జున్ పై అధికారుల మాటలు ఖాతరు చేయడు. ఇంతకూ అర్జున్ ఏం చేశాడు. ఘాజీ బాబా తప్పించుకున్నాడా. ఉరిశిక్ష పడిందా. నలుగురి ప్రేమ వ్యవహారం ఏమయ్యింది. కోర్ట్ మార్షల్ లో ఎలాంటి తీర్పు వచ్చింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

నటీనటుల పెర్ పార్మెన్స్ విషయానికి వస్తే…. ముందుగా అబ్బూరి రవి గురించి చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా డైలాగ్ రైటర్ గా మనకు బాగా నచ్చిన అబ్బూరి రవి నటుడిగానూ సక్సెస్ ఆయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ గెటప్ లో అదరగొట్టాడు. టెర్రరిస్ట్ గా తనదైన డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్ట్ దొరికినట్టే. కథలో మెయిన్ క్యారెక్టర్ కావడంతో పెర్ ఫార్మ్ చేసేందుకు మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు అబ్బూరి. ఇక హీరో ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ ఎన్ ఎన్ జీ కమాండో పాత్రలో నటించాడు. సినిమా కథ తనతోనే ప్రారంభమై… తనతోనే ముగుస్తుంది. సినిమా కథను తన భుజాలమీదేసుకొని నటించాడు. తన నటనను ప్రూవ్ చేసుకునేందుకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక నిత్యా నరేష్, తాన్య, కార్తీక్ రాజు, నూకరాజు ప్రేమ జంటలుగా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీరున్నంతసేపు సినిమా కలర్ ఫుల్ గా ఉంటుంది. అలా వచ్చి ఇలా పోయే పాత్రల్లోకాకుండా నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలివి. వాటికి పూర్తి న్యాయం చేశారు. అనీష్ కురువిల్లాకు మంచి పాత్ర దక్కింది. కృష్ణుడు మతిమరపు వాచ్ మెన్ పాత్రలో నటించాడు. రావ్ రమేష్ మినిస్టర్ గా నటించారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఫాదర్ రోల్ లో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.

దర్శకుడిగా సాయి కిరణ్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే…కాశ్మీర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అందులో ఓ పాయింట్ ను తీసుకొని తనుకున్న బడ్జెట్ లో చక్కగా చూపించాడు. చిన్న సినిమాగా ఎక్కడా అనిపించదు. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో క్వాలిటీ సినిమా చూస్తాం. ఇందులోని ఆర్టిస్టులు మరో బలం. మంచి ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సక్సెస్ అయ్యాడు. అబ్బూరి రవి లాంటి రైటర్ లో విలన్ ను చూడడం గ్రేట్ అనే చెప్పాలి. డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ముకానీకుండా అబ్బూరి పెర్ పార్మ్ చేశాడు. అలాగే నటీనటులందరితో మంచి నటన రాబట్టుకున్నాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం స్క్రీన్ ప్లే. హీరో పాయింట్ ఆఫ్ యూ నుంచి కథను చెప్పించాడు. తర్వాత ఏం జరుగుతుంతా అనే క్యూరియాసిటీ పెంచగలిగాడు. టెర్రరిస్ట్ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి. కానీ ఈ తరహా కథ, కథనం మనకు చాలా కొత్తది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే టైటిల్ కు తగ్గట్టుగా కథ, కథనం ఉన్నాయి. ఇందలో సాయి ప్రతిభ మరోసారి చూపించాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఈ సినిమాకు పోలికే ఉండదు. అలాంటిది ఈ తరహా కథను కూడా బాగా డీల్ చేయగలిగాడు. టెర్రరిస్టుల యాక్టివిటీస్ ని బాగా క్యాప్చర్ చేశాడు. సినిమా ప్రారంభంలో కాశ్మీరీ పండిట్ ను చంపే సీన్ నుంచే సినిమాపై క్యూరియాసిటీ పెంచగలిగాడు. సెకండాఫ్ లో మినిస్టర్ కూతురి విషయంలో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బాగా కుదిరింది.

టెక్నికల్ గా… శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అదరిపోయింది. ముఖ్యంగా పాటలతో పాటు… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆదరగొట్టాడు. చాలా సన్నివేశాల్ని తన రీ రికార్డింగ్ తో నిలబెట్టాడు. గ్యారీ తన షార్ప్ ఎడిటింగ్ తో కథను స్పీడ్ గా పరుగెత్తించాడు. ఎక్కడా బోర్ రానివ్వలేదు. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. జై పాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా రిచ్ గా కనిపిచింది. విజవల్స్ ని బాగా క్యాప్చర్ చేసాడు. అబ్బూరిరవి హెల్ప్ తో స్క్రిప్ట్ డిజైన్ బాగా చేశారు.

ఓవరాల్ గా…
కాశ్మీర్ నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా…. విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి విషయం ఉన్న కథ, కథనం ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో ఉన్నాయి. డైరెక్షన్, నటీనటుల పెర్ పార్మెన్స్, టెక్నికాలిటీస్ సినిమాను నిలబెట్టాయి. ఈ తరహా కథలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే టైటిల్ కు తగ్గట్టుగా…. సాయి కిరణ్ ట్రీట్ మెంట్ ఉంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5