కెరీర్‌ పరంగా నేను ఏ స్థాయిలో ఉన్నానో చెప్పలేను – శర్వానంద్‌

వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ కథానాయకుడు… శర్వానంద్‌. ప్రతిసారీ ఓ విభిన్నమైన కథతో సినిమా చేస్తుంటారాయన. ఆ ప్రయత్నమే శర్వానంద్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆయన నటించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

పరిశ్రమలో ఎవరి స్థానం వాళ్లకి ఉంది. ఎవరికి తగ్గ కథలు వాళ్లకున్నాయి. మామధ్య పోటీ అనేది లేదు. అదే ఉంటే ఎవ్వరం కలవం కదా. మేమంతా ఒకరినొకరం కలుసుకుంటుంటాం, సంతోషంగా గడుపుతుంటాం. దర్శకుల వల్లే నేనునటుడిగా ఎదిగా. ‘గమ్యం’, ‘ప్రస్థానం’ సినిమాల వరకూ ఒకే రకమైన భావోద్వేగాలతో కనిపించేవాణ్ని. ‘రన్‌ రాజా రన్‌’ సుజీత్‌ మేజిక్‌. ఆ సినిమాతోనే నా హావభావాలు మారాయి. ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘మహానుభావుడు’ వల్ల హాస్యం పండించడంలో మరింత పరిణతి సాధించాను. నటుడిగా ‘ప్రస్థానం’ ‘రన్‌ రాజా రన్‌’ సినిమాలతో ఎంతగా మారానో.. ‘పడి పడి లేచె మనసు’తో నాలో అంత మార్పు కనిపిస్తుందని నమ్ముతున్నా.
ఈ కథ కోల్‌కతా నేపథ్యంలో సాగడానికి ప్రత్యేక కారణమేదైనా ఉందా?
ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచాలనే ఆ నేపథ్యాన్ని ఎంచుకొన్నాం. కోల్‌కతా అనగానే ఎక్కువగా హౌరా బ్రిడ్జి, మహంకాళి దేవాలయమే చూపిస్తుంటారు. కానీ అక్కడ యూరప్‌ తరహాలో పురాతన కాలంలో కట్టిన నిర్మాణాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపించాం. అవన్నీ కొత్తగా ఉంటాయి. కోల్‌కతా నేపథ్యంలో తీసిన ‘లక్ష్మీ’, ‘ఖుషి’, ‘చూడాలని ఉంది’ సినిమాలు విజయం సాధించాయి. అలా సెంటిమెంట్‌గా కూడా మాకు ఆ నేపథ్యం కలిసొస్తుందనే నమ్మకం ఉంది.

‘పడి పడి లేచె మనసు’ అంటున్నారు. మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా?
అప్పుడెప్పుడో పడ్డాను కానీ ఇప్పుడు ప్రేమలో ఉన్నానని చెప్పను. ఎప్పుడు ఎలా పడ్డాననేది సమయం వచ్చినప్పుడే చెబుతా (నవ్వుతూ). ప్రతి మనసూ ఏదో ఒక సందర్భంలో పడి లేస్తుంటుంది కదా. అదే ఈ చిత్రం.

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తర్వాత మళ్లీ అలాంటి గాఢతతో కూడిన ఈ ప్రేమకథ చేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
దాంతో పోలిస్తే ఇది పూర్తి భిన్నం. ప్రేమకథలన్నీ రెండు మనసుల నేపథ్యంలోనే సాగుతుంటాయి కానీ, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో పోలిస్తే ఈ కథ యువతరానికీ, కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటుంది. హను రాఘవపూడి ఈ కథ చెప్పగానే అమ్మాయికి ప్రపోజ్‌ చేయడం మొదలు ప్రతి విషయం కొత్తగా అనిపించింది. ఒక అమ్మాయికి ఎన్నిసార్లు ప్రపోజ్‌ చేశాడు, ఎన్నిసార్లు ఆమెని పడేయాల్సి వచ్చిందనేది తెరపైనే చూడాలి. దర్శకుడు హను రాఘవపూడి మంచి సాంకేతిక నిపుణుడు. మన పరిశ్రమలో జూనియర్‌ సుకుమార్‌ అంటారు, తెలుగు మణిరత్నం అంటారు. సాంకేతికంగా అంత బలంగా ఉంటారు. నాతో సినిమా చేయమని తనని ఎప్పట్నుంచో అడుగుతున్నా. మూడు యాక్షన్‌ కథలు చెప్పినా… ‘లేదు, నువ్వు నాతో ప్రేమకథ చేయాల’ని చెప్పాను. అలా ఈ కథ కుదిరింది.

ప్రేమకథల్లో నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ముఖ్యం కదా….
నాకూ, సాయిపల్లవికీ మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రచార చిత్రాలు చూశాక చాలామంది ‘ఇంతకుముందు సినిమాల్లో ఏ కథానాయికతో లేనంత కెమిస్ట్రీ సాయిపల్లవితో కుదిరింది’ అన్నారు. దానికి కారణం సాయిపల్లవే. అద్భుతమైన నటి తను. ఈ చిత్రంలో నేను సూర్య, తను వైశాలి. మేమిద్దరం ప్రేమలో ఉన్నామనుకొనే నటించాం. సెట్‌లో ఆమెతో కలిసి నటించడం సౌకర్యంగా అనిపించింది.

చిత్రీకరణకి ముందు ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఏమైనా సన్నద్ధమయ్యారా?
అలాంటిదేమీ లేదు. ఒకసారి స్క్రిప్టు చదవడం పూర్తయ్యాక మళ్లీ పేపర్‌ని చూసింది లేదు. సెట్‌లో హను చెప్పింది చేశానంతే. కానీ తను కథ చెప్పేటప్పుడు ఒక్కటే చెప్పాడు. సూర్య అనేవాడు ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే ఓ కుర్రాడు, ఫుల్‌ ఆఫ్‌ లైఫ్‌తో కనిపిస్తూ అప్పటికప్పుడు స్పందిస్తుంటాడని… సూర్యుడు ఎంత కాంతివంతంగా కనిపిస్తుంటాడో, నీ మొహంలో అలాంటి తేజస్సు ఉండాలని చెప్పాడు. అది దృష్టిలో ఉంచుకొన్నానంతే. జె.కె, విశాల్‌ శేఖర్‌ తదితరులతో కూడిన సాంకేతిక బృందం ఈ సినిమాకి వెన్నెముకలా నిలిచింది. నిర్మాత సుధాకర్‌ ఒక తపనతో, సృజనాత్మకతని గౌరవిస్తూ మీరు ఎలా తీయాలనుకున్నారో అలాగే తీయండంటూ ఈ సినిమాని నిర్మించాడు.

సినిమా సినిమాకీ మధ్యలో ఎక్కువ సమయం తీసుకుంటుంటారు. కారణమేమిటి?
డబ్బులే సంపాదించాలనుకుంటే వరుసగా సినిమాలు చేయొచ్చు. కానీ సృజనాత్మకతతో కూడిన ఈ రంగంలో నేను అలాంటి ప్రయాణాన్ని ఆస్వాదించలేను. ఒక కథని నమ్ముకుని పూర్తిగా వందశాతం దానికోసం శ్రమిస్తా. ఇంత సమయంలో నా సినిమా రాకపోతే ఇక్కడ ఉంటామో, ఉండమో అనే భయాలైతే నాకు ఉండవు. చేతిలో ఉన్న నా సినిమాని కాపాడుకోవడంపైనే దృష్టిపెడుతుంటా. పక్కా స్క్రిప్టు ఉంటే తప్ప సెట్స్‌పైకి వెళ్లడానికి ఇష్టపడను. నా సినిమాలు ఆలస్యం కావడానికి అది కూడా ఓ కారణమేమో.

సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎంతవరకొచ్చింది?
1980లో జరిగే కథ అది. వర్తమానంలోనూ, గడిచిన కాలంలోనూ రెండు కోణాల్లో సాగుతుంటుంది. ఇంకొక షెడ్యూల్‌ చిత్రీకరణతో అది పూర్తవుతుంది.

యాక్షన్‌ ప్రధానమైన కథలతో ‘ప్రస్థానం’లాంటి సినిమాలు చేశారు. ఈమధ్య వాటికి భిన్నంగా మరో రకమైన కథల్ని ఎంచుకొంటున్నారేంటి?
నా కెరీర్‌లో నేను ప్లాన్‌ చేసుకొన్నదంటూ ఏమీ లేదు. కాకపోతే ఒక తరహా కథ చేశాక, మళ్లీ అలాంటిది చేయకూడదనుకుంటా. ‘రన్‌ రాజా రన్‌’ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చేశా. ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ తర్వాత ‘శతమానం భవతి’ చేశా. ‘పడి పడి లేచె మనసు’ తర్వాత గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంతో కూడిన సుధీర్‌వర్మ చిత్రం వస్తుంది. ‘ప్రస్థానం’ తర్వాత ఏదైతే మిస్‌ అయ్యారో అది సుధీర్‌వర్మ చిత్రంలో ఉంటుంది. నాలుగైదేళ్లుగా అన్ని రకాల కథలొస్తున్నాయి. కెరీర్‌ పరంగా నేను ఏ స్థాయిలో ఉన్నానో చెప్పలేను కానీ, ఒక సంతోషకరమైన స్థానంలో ఉన్నానని చెప్పగలను. నా సినిమాలే నా మార్కెట్‌ని పెంచుతుంటాయి.
‘96’ రీమేక్‌లో మీరే నటించబోతున్నారా?
సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. దాని గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అది చాలా మంచి సినిమా.