స‌న‌త్‌న‌గ‌ర్ పోరులో ప‌వ‌ర్‌స్టార్‌…త‌ల‌సానితో పోరుకు సై

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. స‌న‌త్ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌న అక్క‌డి నుంచి పోటీ చేస్తార‌ని తెలుగు రాష్ర్టాల్లో వినిపిస్తున్న పొలిటిక‌ల్ టాక్‌. ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా త‌ల‌సాని శ్రీ‌నివాస్ పేరును ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే! తెలుగు దేశం టిక్కెట్‌పై గెలిచిన త‌ల‌సాని మ‌ళ్లీ స‌నత్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల విశ్వాసం చూర‌గొన‌గ‌ల‌రా.. అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్పుడిదే పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది.

వాస్త‌వానికి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే జ‌న‌సేన బ‌రిలోకి దిగేందుకు య‌త్నించింది. కానీ అప్పటి ప‌రిస్థితుల ప్ర‌భావం రీత్యా ప‌వ‌న్ వెన‌క్కు త‌గ్గి, బీజేపీ – టీడీపీ ద్వ‌యానికి మ‌ద్ద‌తు ప‌లికి, వాడ‌వాడ‌లా ప్ర‌చారం చేశారు. రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర‌లో సుస్థిర ప్ర‌భుత్వం ఏర్పాడాల‌న్న ధ్యేయంతోనే తాను బీజేపీ – టీడీపీ ద్వ‌యానికి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని ఇటీవ‌ల మ‌రోసారి ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే టీడీపీని వీడి తెరాస‌లో చేరి మంత్రి ప‌ద‌వి పొందిన త‌ల‌సానిపై ఇప్ప‌టికే ప‌లుమార్లు తెలుగు త‌మ్ముళ్లు గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదుచేశారు. అంతేకాదు వ‌ర్ష‌కాల విడిది నిమిత్తం హైద్రాబాద్ వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తిని సైతం క‌లుసుకుని, ఆయ‌న‌పై చ‌ర్య తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. దీనిపై ప్ర‌ణ‌భ్ ఇదే అంశ‌మై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఓ పార్టీ నుంచి గెలిచి, మ‌రో పార్టీలో చేరి మంత్రి ప‌ద‌వి ఎలా తీసుకుంటారు? ఆయ‌న‌తో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం ఎలా చేయిస్తారు? అంటూ రాష్ట్ర‌ప‌తి విస్మ‌యం వ్య‌క్తం చేశార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఐతే త‌ల‌సాని మాత్రం తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి ఇప్ప‌టికే రాజీనామా చేశాన‌ని, ఆమోదించే అంశం స్పీక‌ర్‌ ప‌రిధిలో ఉంద‌ని, ఆయ‌న నిర్ణ‌యం కోస‌మే వేచిచూస్తున్నాన‌ని చెప్పుకొస్తున్నారాయ‌న‌. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో త‌ల‌సాని రాజీనామాను స్పీక‌ర్‌ మ‌ధుసూద‌నాచారి ఆమోదించే అవకాశం ఉంది. అదే జ‌రిగితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ఉప ఎన్నిక బ‌రిలో దిగి త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వాస్త‌వానికి గ్రేట‌ర్ ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌న్న‌ది నిన్న‌మొన్న‌టి దాకా జ‌న‌సేన ప్లాన్‌. కానీ ముందుగా.. స‌న‌త్ న‌గ‌ర్ నుంచి పోటీచేసి, తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను నిజం చేయాల‌న్న‌ది ప‌వ‌న్ త‌ప‌న‌. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం ఏంటంటే ఇదే స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌తో స‌హా బీజేపీ, టీడీపీ కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.

ప‌వ‌న్‌కు టీడీపీ, బీజేపీ మ‌ద్ద‌తా..!!
ఒక‌వేళ స‌నత‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేస్తే ఆయ‌న‌కు టీడీపీ, బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. త‌మ‌కు గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎంతో సాయం చేశాడ‌ని..ఇప్పుడు తాము ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ఆయ‌న్ను పూర్తి మిత్రుడిగా మార్చుకోవాల‌న్న వ్యూహాన్ని రెండు పార్టీలు అమ‌లు చేస్తున్నాయి. ప‌వ‌న్ లాంటి గ‌ట్టి అభ్య‌ర్థి అయితే త‌ల‌సానికి షాక్ ఇవ్వ‌వ‌చ్చ‌న్న ఆలోచన ఈ రెండు పార్టీల్లోను ఉంది. మ‌రి ప‌వ‌న్ ఈ రెండు పార్టీల మ‌ద్ద‌తులో స‌న‌త్‌న‌గ‌ర్ పోరులో దిగుతాడో లేదో చూడాలి.