పవన్ కళ్యాణ్ కదిలే వరకు ప్రభుత్వానికి పట్టదా…..

ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిజాయితీగా పోరాడి వారి ఇబ్బందుల‌ను తొల‌గించాలేగానీ… ఆ స‌మ‌స్య‌ల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోవ‌డం త‌న ల‌క్ష్యంకాద‌న్నదే ప్ర‌ముఖ సినీ హీరో, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుస‌రిస్తున్న మార్గం. రాజ‌కీయాల్లో విలువ‌ల‌ను కాపాడుతూనే త‌న ల‌క్ష్యం దిశ‌గానే అడుగులు వేస్తూ అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నారు ఈ మెగా మాస్ హీరో్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చిన ప‌వ‌న్ దానిని ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వానికి గుర్తు చేయ‌డంతోపాటు, తాను కూడా ఆ బాద్య‌త‌ను భుజాల‌పై వేసుకుని పంచుకుంటున్న విష‌యం తెలిసిందే..!

కాగా సోమ‌వారం ఉద‌యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలతో పాటు, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ కమిషన్‌ నివేదిక త‌దిత‌ర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ఈ సంద‌ర్బంగా రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి ఈ మూడేళ్లలో ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబు.. పవన్‌కు వివరించినట్టు సమాచారం. కాపు రిజర్వేషన్లపై చర్యలు ముమ్మరం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ- బీజేపీ కూట‌మికి జ‌న‌సేన పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తుగా నిలిచిన విష‌యం తెలిసిందే..! కాగా తెలుగునాట విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉన్న ప‌వ‌ర్‌స్టార్ 2019 ఎన్నిక‌ల్లో తీసుకోబోయే రాజ‌కీయ నిర్ణ‌యంపై రాజ‌కీయ పార్టీల‌తోపాటుగా విశ్లేష‌కులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని ముఖ్య‌మంత్రి చంద్రబాబు సైతం మ‌న‌స్ఫూర్తిగా అభినందించ‌డం విశేషం. ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూనే ఉందని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. హార్వర్డ్‌ వైద్య బృందం సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు. వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్గించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుందని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

హార్వర్డ్‌ వైద్య బృందంతో సీఎం భేటీ
ఏకాంత భేటీ అనంతరం హర్వర్డ్‌ ప్రొఫెసర్లు, వైద్యుల బృందంతో కలిసి పవన్ క‌ల్యాణ్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య హార్వర్డ్‌ వైద్య బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. హార్వ‌ర్డ్ నుంచి వైద్య బృందం ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తిని గౌర‌వించి, ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన విష‌యం ఇక్క‌డ ప్ర‌త్య‌ేకంగా చెప్పుకోవాలి.

అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కదిలే వరకు… ఉద్దానం సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా అడుగులు పడలేదని జనాలంటున్నారు. అన్నీ తెలిసిన చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ తో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పెదవి విరుస్తున్నారు.