రామోజీకి నరేంద్రమోడీ ఆహ్వానం.. రాజకీయవర్గాల్లో చర్చ

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పంపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వారణాసిలో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛభారత్‌కు పలువురుని నామినేట్ చేశారు. వారిలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కూడా ఉండడం విశేషం. రామోజీతో పాటు ఆయన పలువురు సభ్యులను నామినేట్ చేశారు. ముంబై డబ్బావాలాలతో పాటు క్రికెటర్లు యువరాజ్‌సింగ్, సారవ్‌గంగూలీతో పాటు కామెడీ నైట్స్ కపిల్‌శర్మ, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, కిరణ్‌బేడీ, సోనాల్‌మాన్‌సింగ్, ఆరోన్‌పూరీ, ఐసీఏఐ ఇలా వ్యక్తులతో పాటు సంస్థలు, సమూహాలను కూడా ఆయన తన స్వచ్ఛభారత్‌కు నామినేట్ చేశారు. అయితే ఈ స్వచ్ఛభారత్‌కు మోడీ ఏపీ నుంచి రామోజీని ఆహ్వానించడంతో ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. రామోజీకి మీడియా కోటాలో రాజ్యసభ సీటు దక్కవచ్చన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనను మోడీ స్వచ్ఛభారత్‌కు నామినేట్ చేయడం సంచలనమైంది.