పూజ రివ్యూ

రేటింగ్: 2.75

సినిమా రివ్యూ: పూజ

పూజ
తెలుగువాడు అయినా తమిళంలో అగ్రహీరోగా పేరు తెచ్చుకుని తెలుగులో కూడా సత్తా చాటుతున్న నటుడు విశాల్. మొదటి నుంచి యాక్షన్ తరహా కథా చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్న విశాల్-తమిళ నాట సింగం హరిగా పేరు తెచ్చుకున్న యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనరే పూజ. ఈ సినిమాలో విశాల్ సరసన శృతీహాసన్ నటించడంతో కాస్త అంచనాలు ఎక్కువయ్యాయి. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం బుధవారం తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో హరి-విశాల్ కాంబినేషన్లో వచ్చిన భరణి సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో ఓ సారి చూద్దాం.

కథ, కథనం:
బొబ్బిలి నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. బొబ్బిలి నుంచి వెళ్లిపోయి బీహార్ గుండాగా ఎదిగి తిరిగి బొబ్బిలి వస్తాడు సింగన్నపాత్రుడు(ముఖేష్ ఆద్వాని). అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి దాని ముసుగులో గుండాయిజం, హత్యలు చేస్తుంటాడు. అక్కడ వాసు(విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా సింగన్నపాత్రుడు ఎస్‌పీ(సత్యరాజ్)ను చంపాలనుకుంటున్న సమయంలో వాసు కాపాడతాడు. ఇక మధ్యలో వాసు దివ్య (శృతీహాసన్)ను చూసి ప్రేమలో పడతాడు.

ఇక సింగన్న జీకే గ్రూఫ్ ఆఫ్ కంపెనీ యజమాని అయిన రాధిక కుటుంబంపై పగ పెంచుకుంటాడు. అదే కుటంబానికి చెందిన వాసు తన కుటుంబాన్ని సింగన్న నుంచి ఎలా కాపాడుకున్నాడు. ఆ కుటుంబానికే చెందిన వాడైనా ఎందుకు బయట ఒంటరిగా ఉంటున్నాడు? అసలు సింగన్నకు రాధిక కుటుంబానికి ఎందుకు విబేధాలున్నాయి? రాధిక కుటుంబాన్ని సింగన్న ఎందుకు చంపాలనుకుంటాడు? మధ్యలో వాసు తన ప్రేమను గెలిపించుకున్నాడా ? చివరకు సినిమా ఎలా ముగిసింది అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల ప్రదర్శన:
వాసుగా నటించిన విశాల్ గతంలో ఇలాంటి యాక్షన్ తరహా పాత్రల్లో ఎన్నోసార్లు నటించాడు. ఇందులో అతడు కొత్తగా చేశాడని చెప్పడానికి పెద్దగా ఏమీలేదు. అయితే హైవోల్టేజ్ యాక్షన్ సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగానే ఎనర్జీతో అదరగొట్టాడు. ఇక శృతీహాసన్ గ్లామర్‌గా కనిపించింది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడు పాటల్లో మరింత అందంగా తన వయ్యారాలు ఒలకబోసింది. చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన రాధిక కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించింది. విలన్‌రోల్ చేసిన ముఖేష్ ఆద్వాన్ని తన పాత్రకు న్యాయం చేసేలా నటించాడు. ఎస్పీ పాత్రలో నటించిన సత్యరాజ్ పాత్ర తేలిపోయింది. ఇక మిగిలిన నటులు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికత:
యువన్‌శంకర్ రాజా సంగీతం అందిచిన సంగీతం పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని చోట్ల మాత్రమే మెరిసింది. యువన్ సంగీతం నిరాశపర్చింది. సినిమాటోగ్రఫీ ఓకే. విజయన్-జై ఎడిటింగ్ సెకండాప్‌లో పెద్ద మైనస్‌గా మారింది. హరి సినిమా కాబట్టి ఫైట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ సన్నివేశాలకు వంక పెట్టాల్సిన పనిలేదు. మాస్ ప్రేక్షకులకు కావాల్సినంత విందు భోజనం ఉంది. నిర్మాతగా విశాల్ బాగా ఖర్చు పెట్టాడు. సినిమా చాలా లావిష్‌గా ఉంది.


కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగాలు డీల్ చేసిన హరి కథలో కొత్తదనం లేదు. కొన్ని చోట్ల మాత్రమే సీన్స్ బాగా రాసుకుని వాటినే బాగా తీశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ పూజ సినిమాలో హరిపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాకు స్క్రీన్‌ప్లేతో పాటు సినిమా ద్వితియార్థం ప్రధాన మైనస్‌గా నిలిచాయి.

ఫైనల్‌గా…
భరణి తర్వాత విశాల్-హరి కాంబినేషన్లో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది. విశాల్, శృతీహాసన్, యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఈ సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలిచాయి. మిగిలినవన్ని మైనస్‌లే. ఊహాజనిత కథనం, పాటలు, ఇతర పాత్రలకు ప్రాధాన్యం లేకపోవడం, కథలో ఎక్కువ పాతదనం ఇవన్నీ సినిమాను అట్టడుగుకు నెట్టేశాయి. సెకండాప్‌లో హీరో పాత్రకు తగ్గినట్టుగా విలనిజం పాత్ర తేలిపోతుంది. దీని వల్ల హీరో పాత్ర ఎంత బాగా వచ్చినా అది ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అయితే తెలుగులో ఇలాంటి మాస్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్ని పుష్కలంగా ఉన్నందున మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.