తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల ప్రత్యూషను ఆదుకునేందుకు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళీ ముందుకు వచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యూష బీఎస్సీ చదవాలనుకుంటుందని తెలిసిందని…ఆమె చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ..తన సాయం వద్దనే వరకు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు.
ప్రత్యూషను ఎవ్వరు ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం, తనను అమితంగా కలిచివేసిందని చెప్పారు. ప్రత్యూష ఘటన వివరాలు తెలిసిన తర్వాత ఎంత చలించిపోయానో, ఎంతగా ఏడ్చానో తనకు, తన భార్యకు మాత్రమే తెలుసునని అన్నారు. తాను కూడా చిన్నతనంలో తండ్రిని కోల్పోయానని..అయితే తండ్రి మరణం తర్వాత దొంగనో, రౌడినో కావాల్సిన తాను పరుచూరి బ్రదర్స్ దయతో ఇంతటి వాడినయ్యానని చెప్పారు.
ప్రత్యూష తండ్రికి, సవతి తల్లికి ఉరిశిక్ష వేసి, అదే రోజు అమలు చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. ప్రత్యూషను అంతగా చిత్రహింసలకు గురి చేసిన ఆ సవతి తల్లి ఒక ఆడదేనా అని పోసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.