మెగామూవీ నుంచి పూరీ ఔట్.. కార‌ణాలు ఇవేనా..?

అంతా అనుకున్న‌ట్లే అయింది.. మెగాస్టార్ మూవీ నుంచి పూరీ జ‌గ‌న్నాథ్ ను త‌ప్పించారు. ఆ స్థానంలోకి వినాయక్ వ‌చ్చి చేరిపోయాడు. పూరీని త‌ప్పించే విష‌యంపై కొంత‌కాలంగా టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ పూరీ జ‌గ‌న్నాథే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తానే ద‌ర్శ‌కుడిన‌ని క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతో మ‌ళ్లీ ఆ వైపుగా ఎవ్వ‌రూ ఆలోచించ‌లేదు. కానీ ఇప్పుడు అంతా క్లియ‌ర్ అయిపోయింది. పూరీని త‌ప్పించేసారు.. ఆ ప్లేస్ లోకి వినాయక్ ను తీసుకొచ్చారు. ఈ విషయంపై అధికార‌క ప్ర‌క‌ట‌న మాత్ర‌మే బ్యాలెన్స్. మిగిలిన త‌తంగం అంతా పూర్త‌యింద‌ని స‌మాచారం. అందుకే పూరీ సీన్ లో క‌నిపించ‌కుండా.. బ్యాంకాక్ వెళ్లి వ‌రుణ్ తేజ్ క‌థ రాసుకుంటున్నాడ‌ని టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది.

పూరీని త‌ప్పించ‌డానికి కార‌ణాలు ఇవేనా..?
1. 150వ సినిమాను చాలా ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకున్నాడు చిరంజీవి. ఎనిమిదేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ కావ‌డంతో మెగాక్యాంప్ తో పాటు అభిమానులు కూడా ఈ సినిమాపై కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు. పూరీ ద‌ర్శ‌కుడు అని తెలిసిన త‌ర్వాత ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. కానీ రెండు నెలల‌కో సినిమా చుట్టేసే పూరీ అంటే కాస్త కంగారు ప‌డ్డారు ఫ్యాన్స్. దీనికి త‌గ్గ‌ట్లే పూరీ కూడా చిరు సినిమా అనౌన్స్ అయిన మ‌రుస‌టి రోజే మ‌హేశ్ కు క‌థ చెప్పాను.. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది అని ట్వీట్ చేసాడు. దీంతోపాటు నితిన్ సినిమా ఉంటుంద‌ని చెప్పి ఆపేసాడు. త‌ర్వాత వ‌రుణ్ తేజ్ సినిమా అనౌన్స్ చేసాడు.

2. కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్న ప్రాజెక్ట్ ను ఏదో తూతూ మంత్రంగా మూడు నెల‌ల్లో ముగించ‌డం అంటే మాట‌లు కాదు. పైగా ఇప్ప‌టివ‌ర‌కు చిరంజీవికి ఫుల్ స్టోరీ చెప్ప‌నేలేదు పూరీ. అంత‌లోనే వ‌రుణ్ సినిమాపై కూర్చున్నాడు. ఇది సెప్టెంబ‌ర్ నాటికి గానీ పూర్తికాదు. ఈ లోపే చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 22 వచ్చి వెళ్లిపోతుంది. అంటే ఆ టైమ్ కు పూరీ అందుబాటులో ఉండ‌డు. ఉన్నా.. వ‌రుణ్ తేజ్, చిరంజీవి సినిమాలు ఒకేసారి హ్యాండిల్ చేయాల్సిన ప‌రిస్థితి. ఇదే మెగాక్యాంప్ ను క‌ల‌వ‌ర‌పెడుతుంది.

3. వేగం అన్ని స‌మ‌యాల్లో వ‌ర్క‌వుట్ కాదు. చిరంజీవి సినిమా విష‌యంలో పూరీ ప్ర‌ద‌ర్శించిన అత్యుత్సాహ‌మే అత‌డికి అరుదైనా అవ‌కాశాన్ని దూరం చేసింద‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఆ మ‌ధ్య చిరంజీవి సినిమా కోసం తానేమీ వేచి చూడ‌లేద‌ని.. స్వ‌యంగా చిరంజీవే పిలిచి త‌న సినిమా చేయాల్సిందిగా త‌న‌ను కోరాడ‌ని బాహాటంగా చెప్పాడు పూరీ. ఇది చిరుకు కాస్త చికాకు తెప్పించింద‌నే ప్రచారం సాగింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. 150వ సినిమా సందేశాత్మ‌కంతో పాటు మాస్ అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు చిరంజీవి. సోష‌ల్ మెసేజ్ సినిమాను పూరీ హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అనే అనుమానం కూడా అత‌డి తొల‌గింపుపై ప్ర‌భావం చూపించింది. ఠాగూర్ ను వినాయ‌క్ తెర‌కెక్కించిన తీరు న‌చ్చి.. త‌న రీ ఎంట్రీ మూవీ కూడా వినాయ‌క్ కే అప్ప‌గించాడ‌ని స‌మాచారం. ఇందులో న‌య‌నతార ఓ హీరోయిన్ గా ఆల్ మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ కాగా.. త‌మన్న సైతం లైన్ లో ఉంది. మొత్తానికి ఇప్పుడు ఛాన్స్ మిస్ అయినా.. త‌ర్వాత పూరీకి ఓ అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్.