రాగల 24 గంటల్లో సినిమాకు కథ, నిర్మాతే హీరో – డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఈవీవీ తరహాలో హాస్యాన్ని అద్భుతంగా పండించి పలు సక్సెస్ లు అందుకున్నాడు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. తనదైన బలమైన కథలతో మెప్పించాడు. అయితే ఢమరుకం తర్వాత కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు మాత్రం తన జోనర్ ను కంప్లీట్ గా మార్చి చేసిన చిత్రం రాగల 24 గంటల్లో. ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు శ్రీనివాస రెడ్డి. పూర్తిస్థాయి థ్రిల్లర్‌ జానర్‌ సినిమా. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌లో సాగే కథ అని శ్రీనివాస రెడ్డి అంటున్నారు. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, కృష్ణభగవాన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి పంచుకున్న విశేషాలు…

” నేను, కృష్ణభగవాన్‌ రెండు స్క్రిప్ట్స్‌ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్‌ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. హీరోయిన్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్‌ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్‌ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్‌’ రీమేక్‌ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాం. అది సెట్స్‌ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్‌గా. అదీ వర్కౌట్‌ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ డైరెక్టర్‌ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్‌ హెచ్‌డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్‌ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్‌ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. నేను ఫామ్‌లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్‌. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్‌ అవుతోంది. శ్రీనివాస్‌ కానూరి ప్రొడక్షన్‌లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను”.