జానారెడ్డికి రాహుల్ షాక్‌… పార్టీలో ఉంటారా వెళ‌తారా

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిగ్‌షాక్ ఇచ్చారు. మీరు పార్టీ మార‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. పార్టీలో ఉంటారా…వెళ‌తారా అని నేరుగా ప్ర‌శ్నించ‌డంతో జానా ఒక్క‌సారిగా అవ‌క్కయ్యార‌ట‌. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని….ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా త‌న‌తోనే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది.

బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ సంద‌ర్భంగా రాహుల్ ఈ ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. సీనియర్లు పార్టీనుంచి వెళ్లిపోతుంటే దాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదని కూడా రాహుల్ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు జానా కాస్తా కంగారు పడి…తాను కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని అన్న‌ట్టు సమాచారం.

డీఎస్ లాంటి న‌మ్మ‌క‌స్తులు కూడా పార్టీని వీడుతుంటే ఎవ్వ‌రిని న‌మ్మాలో కూడా తెలియ‌డం లేద‌ని…రాహుల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వెంట‌నే ఉత్తమ్, షబ్బీర్ అలీ డీఎస్ పార్టీ వీడ‌డం వ‌ల్ల వ‌చ్చిన న‌ష్ట‌మేమీలేద‌ని చెప్పినా రాహుల్ మాత్రం పార్టీ ఫిరాయింపుల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని వారికి సూచించార‌ట‌. రానున్న ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించిట్టు తెలిసింది.