రాజావారు రాణిగారు మూవీ రివ్యూ

రాజావారు రాణిగారు మూవీ రివ్యూ

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా… జయ్ క్రిష్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా ఉందొ లేదో చూద్దాం.

క‌థేంటంటే: అది రామాపురం అనే ప‌ల్లెటూరు. రాజా (కిర‌ణ్‌)కి రాణీ (ర‌హ‌స్య గోర‌క్‌) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి త‌న వెంటే తిరుగుతుంటాడు. కానీ మ‌న‌సులో మాట చెప్పలేడు. రాణీ పై చ‌దువుల కోసం అమ్మమ్మవాళ్ల ఊరు వెళ్లిపోతుంది. త‌న కోసం ఎదురుచూస్తూ రామాపూరంలోనే గ‌డిపేస్తుంటాడు రాజా. మూడేళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ సొంత ఊరు తిరిగొస్తుంది. వ‌చ్చిన తర్వాతైనా రాజా.. త‌న మ‌న‌సులో మాట రాణీకి చెప్పాడా లేదా? అనేదే ‘రాజావారు – రాణీగారు’ సినిమా.

సమీక్ష
దర్శకుడు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ప్రేమ కథను తెరకెక్కించాడు. క‌థ‌గా చెప్పుకోవాలంటే చాలా చిన్న లైన్‌. మ‌న‌సులోని మాట చెప్పుకోలేని ఓ ప్రేమికుడి క‌థ‌. అంతే. కానీ దాన్ని తెర‌పై వినోదాత్మకంగా, భావోద్వేగ‌భ‌రితంగా తీర్చిదిద్దడంలో ద‌ర్శకుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, వాటిని న‌డిపించిన ప‌ద్ధతి.. వినోదాన్ని పండిస్తాయి. క‌థ‌లో పెద్దగా మ‌లుపులు లేక‌పోయినా.. క‌థ ఒక‌చోటే తిరిగినా.. అదేం పెద్ద స‌మ‌స్యగా మార‌లేదు. చౌద‌రి, నాయుడు అనే ఇద్దరు స్నేహితుల్ని ఈ క‌థ‌లోకి లాక్కొచ్చి ద‌ర్శకుడు మంచి ప‌ని చేశాడు. వాళ్లతో కావ‌ల్సినంత వినోదం పండించాడు. ప‌ల్లెటూరులో క‌నిపించే సంగ‌తులు, వాళ్ల మ‌ధ్య సంభాష‌ణ‌లూ అచ్చుగుద్దిన‌ట్టు తెర‌పైకి తీసుకొచ్చేశాడు. దాంతో ఓ ప‌చ్చటి పల్లెటూరులో కూర్చుని కొంత‌మంది మ‌నుషుల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రథమార్ధం హాయిగా సాగిపోతుంది. క‌థంతా ఒకే పాయింట్ చుట్టూ తిరిగినా ఎక్కడా బోరు కొట్టదు. ప‌తాక స‌న్నివేశాల్లో ద‌ర్శకుడు ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు. ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోష‌న్‌తో సినిమాని ముగించాడు. చిన్న లైన్ అనుకుని, ఆ లైన్‌ని దాట‌కుండా క‌థ‌ని చెప్పడం, పాత్రల్ని న‌డిపించ‌డం మామూలు విష‌యం కాదు. స్టార్లు లేకుండా రెండు గంట‌ల పాటు కూర్చోబెట్టాడంటే ద‌ర్శకుడిలో విష‌యం ఉన్నట్టే.

కిర‌ణ్‌, ర‌హ‌స్య గోర‌క్‌ల‌కు ఇదే తొలి సినిమా. కిర‌ణ్ బాగా న‌టించాడు. ప‌ల్లెటూరి అబ్బాయి పాత్రలో ఇమిడిపోయాడు. త‌న మ‌న‌సులోని మాట చెప్పుకోలేక‌, లోప‌ల దాచుకోలేక మ‌ధన ప‌డే పాత్రలో మంచి మార్కులు కొట్టేస్తాడు. ర‌హ‌స్య ఓకే అనిపిస్తుంది. క‌థానాయిక‌లో గ్లామ‌ర్ కంటే, ప‌ల్లెటూరి స్వచ్ఛత‌కే దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టున్నాడు. క‌థానాయ‌కుడి స్నేహితులుగా క‌నిపించిన‌వాళ్లు, డాక్టరు అల్లుడు, హీరో, హీరోయిన్ తండ్రి పాత్రధారులూ.. ఇలా అంద‌రూ బాగా చేశారు. ముఖ్యంగా నాయుడు, చౌద‌రిలుగా క‌నిపించిన స్నేహితులిద్దరూ కావ‌ల్సినంత టైమ్ పాస్ అందిస్తారు. నేప‌థ్య సంగీతం, పాట‌లు ఈ చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. సంగీతం స‌న్నివేశాన్ని ఎలివేట్ చేసింది. కెమెరా ప‌నిత‌నం కూడా ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకుడు నేల విడ‌చి సాము చేయ‌లేదు. నేల‌పైనే ఉండి ఓ క‌థ చెప్పాడు. ప్రేమ‌లోని స్వచ్ఛత పంచాడు. అక్కడే మార్కులు ప‌డిపోతాయి.

చివరగా…
నవ్వించే భావోద్వేగ ప్రేమ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ కథనం ఇందులో బాగా ఉన్నాయి. మంచి హాస్యం హాయిగా నవ్విస్తుంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5