బాహుబలి కథ.. ఎక్స్‌క్లూజివ్

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తున్న సినిమా బాహుబలి. అగ్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రథమార్థం వచ్చే వేసవిలో ఏప్రిల్ 15న విడుదల కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా గురించే ఎక్కడ చూసినా చర్చలు జరుగుతున్నాయి. పల్లిబఠాని.కామ్ ప్రతినిధులకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు. ఇందులో ఓ రాజ్యంకోసం వీరిద్దరు విరోచితంగా పోరాడతారు. చివరకు ఈ యుద్ధంలో ఎంతోమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో రాజ్యం కోసం యుద్ధాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు మనకు ఎవరిచ్చారన్న నిర్ణయానికి వచ్చిన వారిద్దరు రాజ్యాన్ని వదిలేసి బౌద్ధమతం స్వీకరిస్తారని సమాచారం.

దర్శకుడు రాజమౌళి చరిత్రలో ఉన్న కర్ణాటకలోని శ్రావణబెళగొల ప్రదేశంతో పాటు మహాయాన బౌద్ధం, గోమటేశ్వరుడి విగ్రహం తదితర సెట్లు వేసి ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాడు. ఇవన్ని చూస్తుంటే ఉత్తరభారతదేశంలో మధ్యయుగంలో ఓ రాజ్యాన్ని పాలించిన అన్నదమ్ముల కథే గుర్తుకు వస్తోంది. వీరు రాజ్యం కోసం గొడవపడి యుద్ధం చేస్తారు. చివరకు వారు శాంతి మంత్రం జపించి మహాయాన బౌద్ధాన్ని స్వీకరిస్తారు. చివరకు వారు రాజ్యాన్ని వదిలేసి దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఉన్న శ్రావణబెలగొళకు వచ్చి ఇక్కడే నిర్యాణం పొందుతారు. సినిమా తొలి భాగాన్ని బాహుబలి తమ్ముడిపై విజయం సాధించడంతో ముగించే అవకాశాలున్నాయి. 

 
ద్వితీయార్థంలో తిరిగి తమ్ముడు బాహుబలిపై యుద్ధం ప్రకటించి చివరకు ఇద్దరు శాంతి మంత్రం జపించేలా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి ప్రస్తుతం ఆయన చిత్రీకరిస్తున్న సన్నివేశాల దృష్ట్యా ఈ కథకు బాహుబలి సినిమాకు పోలికలున్నాయి. ఒకవేళ రాజమౌళి ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సన్నివేశాలు మార్చినా మూల కథ మాత్రం చరిత్రనుంచే స్వీకరిస్తున్నట్టు సమాచారం.