లింగ టిక్కెట్టు రూ.12వేలు… జపాన్ నుంచి ఫ్యాన్స్ రాక.. రజనీకి పాలాభిషేకాలు

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లింగ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. మొత్తం 2300 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా అదే రోజు రజనీ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ గురువారం మధ్యాహ్నం నుంచే తమిళనాట హంగామా స్టార్ట్ చేశారు. 
తమిళనాడులో 500 థియేటర్లు, కేరళలో 225 థియేటర్లు, యూఎస్‌లో 300 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. కేరళలో ఓ డబ్బింగ్ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదలవుతుండడం ఇదే తొలిసారి. తమిళనాడులోని అన్ని థియేటర్లలోను దాదాపు లింగాను ప్రదర్శిస్తున్నారు. యూఎస్‌లో 300 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతుండడం ఇదే తొలిసారి. 

చెన్నైలోని రెమీ థియేటర్లో ఉదయం 7.30 గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు ఒక్కో టిక్కెట్టు రూ.12 వేలకు అభిమానులు కొనుగోలు చేశారు. ఒక హీరో సినిమాకు ఇంత భారీ మొత్తం వెచ్చించి టిక్కెట్టు కొనుగోలు చేయడం తమిళనాడులో రికార్డుగా నిలిచింది. ఇక తమిళనాడులోని మారుమూల గ్రామాల్లో కూడా ఉదయం 6 గంటలకే అన్ని థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు. రజనీ కటౌట్లకు ఉదయాన్నే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాను చూసేందుకు జపాన్‌లో ఉన్న రజనీ అభిమానులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. వీరు ఉదయాన్నే షో వీక్షించనున్నారు. ఇక తెలుగులో కూడా లింగ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలోను అడ్వాన్స్‌డ్ టికెట్లు బుక్ అయ్యాయి. మొత్తానికి దక్షిణాదిలో లింగ మానియా ఊపేస్తోంది.