బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు ట్రైలర్ రివ్యూ….

ఇప్పటివరకు చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో…. ఎలాంటి సినిమా చేయాలో తెలియక తికమక పడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. స్టార్ డైరెక్టర్స్ నుంచి కొత్త దర్శకుల వరకు అందరితోను సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు బెల్లంకొండ కోరుకున్న విజయాన్ని అందించలేకపోయారు. రీమేక్ సినిమాలు చేసినా కూడా ఫలితం శూన్యం. మొన్నటికి మొన్న తేజ తెరకెక్కించిన సీత సినిమా అయితే మరీ దారుణం. అది ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమా రాక్షసుడు. తమిళనాడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాచసాన్ సినిమాకు రీమేక్ ఇది. ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ఆ నమ్మకం నిజమే అనిపిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో తొలి భారీ విజయం ఇదే కాబోతుంది అని దర్శక నిర్మాతలు కూడా ధీమాగా కనిపిస్తున్నారు. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 2న సినిమా విడుదల కానుంది. తమిళంలో అమలాపాల్ హీరోయిన్ కాగా అక్కడ అనుపమ పరమేశ్వరన్ ఆ పాత్రలో నటిస్తుంది. అమాయకమైన ఆడ పిల్లలను తన ఆనందం కోసం చంపే ఒక సైకో కిల్లర్ కథ ఇది. అతడిని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు.. ఆయన వల్ల ఏం నష్టపోయాడు అనేది ఈ చిత్ర కథ. అద్భుతమైన స్క్రిప్ట్ తో సాగిపోయే ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 2న మరో మూడు సినిమాలతో కలిసి రాబోతుంది రాక్షసుడు. మరి చూడాలిక బెల్లం బాబు కోరుకున్న విజయం ఈ సినిమాతో అయినా వస్తుందో లేదో.