రంగు మూవీ రివ్యూ….

రంగు మూవీ రివ్యూ….

లారా అనే రౌడీషీటర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన రంగు సినిమా రిలీజ్‌కు ముందు వివాదాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత వివాదాలు సమస్య పరిష్కారం చేసుకోని గ్రాండ్ గా విడుదల చేశారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తనీష్ అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొంటున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత క్రేజ్‌ను సంపాదించుకొన్న యువ హీరో రంగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి వీ కార్తికేయ దర్శకుడు. ప్రియా సింగ్ హీరోయిన్‌గా, పోసాని, షఫీ, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి రవి ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే…..
పవన్ కుమార్ అలియాస్ లారా క్రమశిక్షణతోపాటు రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకొన్న విద్యార్థి. ర్యాగింగ్, ఇతర పరిస్థితుల కారణంగా కాలేజీ గ్యాంగ్‌వార్‌లో కూరుకుపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. పరిస్థితులు ప్రభావం వల్ల విజయవాడలో రౌడీగా మారిపోతాడు. ఆ తర్వాత సెటిల్మెంట్స్, రాజకీయవేత్తలను శాసించే స్థాయికి చేరుకొంటాడు. రంగు మూవీలో ట్విస్టులు విధి ఆడిన నాటకంలో లారాకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దాంతో ప్రేమించిన పూర్ణ (ప్రియా సింగ్)ను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతుకుదామనుకొంటాడు. లారా అస్థిత్వమే జీవన్మరణ సమస్యగా మారుతుంది. తనకు ఎదురైన పరిస్థితులను ఎలా ఎదురించాడు? రౌడీ జీవితానికి ముగింపు పలకడానికి కారణమేంటి? బ్రతుకు పోరాటంలో లారా రాజీ పడాల్సిన అవసరం ఎందుకొచ్చింది. పోలీసు, రాజకీయ దాడుల మధ్య లారా జీవితం ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే రంగు చిత్ర కథ.

సమీక్ష…

రంగు ఫస్టాఫ్ అనాలిసిస్ మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో రంగు చిత్రాన్ని ప్రారంభించడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి లారా జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తొలిభాగంలో కొంత అనవసరమైన సీన్లు, సాగదీత కనిపించినా కథ ట్రాక్ తప్పకుండా ముందుకెళ్లడంతో ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. కథనంలో వేగం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. పోసాని మార్కు కామెడీ వినోదాన్ని కొంత పంచుతుంది. కొన్నిసీన్లలో డైలాగ్ వెర్షన్ ఎక్కువ కావడం కొంత కథకు బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో తొలిభాగం ముగియడమే కాకుండా సెకండాఫ్ ఆసక్తిని పెంచుతుంది. రంగు సెకండాఫ్ అనాలిసిస్ రంగు సెకండాఫ్‌లో కథలో ఉండే బలం కనిపిస్తుంది. భావోద్వేగమైన సన్నివేశాలు ప్రేక్షకుడిని కుదిపేస్తాయి. లారా రాజీపడి జీవితాన్ని కొనసాగించే సీన్లలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు ప్రేక్షకుడికి ఎమోషన్‌కు గురిచేస్తాయి. ఇక ప్రీక్లైమాక్స్‌లో స్క్రీన్ ప్లే ఓ మ్యాజిక్ కనిపిస్తుంది. కథ, కథనాలకు తనీష్ నటనా ప్రతిభ తోడవ్వడంతో సినిమా మరో స్థాయికి చేరుకొంటుంది. చివరి 20 నిమిషాల కథ అత్యంత భావోద్వేగమైన సన్నివేశాలతో నిండిపోయింది.

డైరెక్టర్ కట్

దర్శకుడు కార్తీకేయ టాలెంట్ దర్శకుడు కార్తీకేయ చేసిన రీసెర్చ్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సినిమాను ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన తీరు చూస్తే సినిమా పట్ల తపన కనిపిస్తుంది. బలమైన క్యారెక్టర్లు, డైలాగ్స్ కార్తీకేయ ప్రతిభకు అద్దంపట్టాయి. కథలో, పాత్రల్లో వేరియేషన్స్ ఉన్నప్పటికీ దర్శకుడిగా బ్యాలెన్స్ కోల్పోకుండా సరైన ట్రాక్‌పై సినిమాను పరుగులు పెట్టించారు. నటుడిగా తనీష్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. తొలి సినిమా దర్శకుడిగా పాస్ మార్కుల కోసం ప్రయత్నించకుండా ఫస్ట్‌ క్లాస్ కోసం ప్రయత్నించిన విద్యార్థిని కార్తికేయలో చూడవచ్చు.

తనీష్ యాక్టింగ్ హైలెట్ బాలనటుడిగా, కమర్షియల్ హీరోగా, విలన్‌గా తనీష్‌ను ఇప్పటి వరకు చూసినది ఒక ఎత్తు. లారా పాత్రలో తనీష్ కనిపించింది మరో ఎత్తు. పాత్రను నరనరాల్లో జీర్ణించుకొని నటించినట్టు కనిపిస్తుంది. లారా పాత్రతో తనలోని నటుడిని సంపూర్ణంగా ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో తనీష్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా తనీష్‌కు మంచి పేరును తీసుకొస్తుందని గ్యారెంటిగా చెప్పుకోవచ్చు. అందం, అభినయంతో ప్రియా సింగ్ హీరోయిన్‌గా ప్రియా సింగ్ అందంతో ఆకట్టుకొన్నది. తన పాత్ర పరిధి మేరకు అభినయంతో కూడా మెప్పించింది. కీలక సన్నివేశాల్లో తన టాలెంట్‌ను చక్కగా ప్రదర్శించింది. పూర్ణ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేకూర్చింది. పాటలకు, డ్యాన్సులకు ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి మెప్పించింది. ఇతర పాత్రల గురించి ఇక రంగు చిత్రంలో ఏసీపీగా పరుచూరి రవి, పోసాని, షఫీ పాత్రల గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందే. పరుచూరి రవి సినిమాకు వెన్నుముకగా నిలిచాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో చక్కగా రవి ఒదిగిపోయాడు. భారమైన డైలాగ్స్‌ను తన బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా మార్చుకొని ప్రతీ సన్నివేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. పోసాని పాత్ర తొలిభాగానికే పరిమితమైనా.. రెగ్యులర్ కామెడీతో ఒకే అనిపించాడు. పరుచూరి వెంకటేశ్వరరావ్ తన మార్కు నటనను ప్రదర్శించాడు. సాఫ్ట్ విలన్‌గా షఫీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు షఫీ ప్రదర్శించిన నటన హైలెట్‌గా నిలిచింది.

టెక్నీషియన్స్ టాలెంట్….
యోగీశ్వర శర్మ మ్యూజిక్ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు యోగీశ్వర శర్మ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలిభాగంలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాకు రీరికార్డింగ్ ప్రధానమైన ఆకర్షణ. పాటలు పెద్దగా మాట్లాడుకొనే అవకాశం లేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కొంత ఆసక్తికరంగా ఉంది. సినిమాటోగ్రఫి గురించి సినిమాటోగ్రాఫర్ టీ సురేందర్ రెడ్డి పనితీరు సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు.

ఫైనల్ గా…

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో రంగు రూపొందించారు. ఒకరి జీవితాన్ని చక్కగా ఆవిష్కరించారు. రంగు సినిమా.. చాలా మంది మేకర్స్ ని ఆలోచింపజేస్తుంది. తనీష్ కి తన కెరీర్ లో మంచి సినిమాగా రంగు నిలుస్తుంది. సో గో అండ్ వాచ్.

Rating : 3.25/5