ఎర్రచందనం స్మగ్లర్లపై ఇ-నిఘా

అటవీమార్గాల్లో రహస్య కెమెరాలు అమర్చాలన్న సీయం చంద్రబాబు:ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం దొంగలను పూర్తిగా అదుపుచేసేందుకు ఎక్కడికక్కడ ఇ-విజిలెన్స్ ఏర్పాటుకాబోతోంది. ఇక ఒక్క ఎర్రచందనం దుంగ కూడా స్మగ్లింగ్ చేయడానికి వీలు లేకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో సీయం ఎర్రచందనంపై సమీక్షా సమావేశం జరిపారు. కంట్రోల్ రూమ్ పెట్టుకుని టాస్క్ ఫోర్స్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటుచేసుకోవాలని, అడవుల నుంచి వెళ్లే అన్ని రహదారుల్లోను కెమెరాలు అమర్చాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలో అసలు ఎంత ఎర్రచందనం సంపద ఎంత వుందో లెక్క తేల్చేందుకు, వాటి వాస్తవ విలువ కట్టేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు తెలిసివున్న ఒక కన్సల్టెంట్ ను వెంటనే నియమించుకోవాలని ముఖ్యమంత్రి అటవీశాఖ అధికారులకు సూచించారు. గతంలో అడవి దొంగలు తరలించుకుపోయిన ఎర్రచందనం విలువ ఎంతో ఇప్పటికీ గుర్తించే పరిస్థితి లేకపోయిందని అన్నారు. కన్సల్టెంట్ నియామకం వలన వాస్తవ అంచనాలు తెలియడమే కాకుండా అటవీ సంపదను పరిరక్షించుకునే అవకాశం దక్కుతుందని వివరించారు.
 గతంలో పోలిస్తే ఎర్రచందనం అక్రమ రవాణా 70శాతం తగ్గిపోయిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించి చెప్పారు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎర్రచందనం చెట్లు వున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం 10, 500 మెట్రిక్ టన్నుల స్టాక్ వుందని తెలిపారు. అందులో 2,690 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఆక్షన్ వేశామని చెప్పారు. వేలంలో 850 కోట్ల రూపాయిల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని అన్నారు. ఇప్పుడు మరో 4వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం డ్రెస్సింగ్ చేసి రెండవ విడత వేలానికి సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 5నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

నెల్లూరు, రాజంపేట, కడప ప్రాంతాలలో ఎర్రచందనం సంపద ఎక్కువగా వున్నట్టు సీయంకు వివరించారు. ఏటా 4వేల మెట్రిక్ టన్నుల సంపద ఆక్షన్ కు వస్తుందని చెప్పగా, దాన్ని 10 వేల మెట్రిక్ టన్నులకు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి అవసరమైన అనుమతులు తీసుకుని అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నరికేసిన చెట్లకు నష్ట పరిహారంగా మళ్లీ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. అందుకోసం నర్సరీలను ఏర్పాటుచేయాలని, అటవీ ప్రాంతంలో పాటు గ్రామాలలో కూడా వీటిని పెంచడం వలన గ్రీనరీ కూడా వుంటుందని చెప్పారు.
అలాగే, రాష్ట్రంలో దుంగల్ని డ్రెస్సింగ్ చేసేప్పుడు వచ్చే శాండ్ డస్ట్ ను ఉపయోగించుకునేలా ఒక యూనిట్ నెలకొల్పాలని సీయం చెప్పారు. దీనికి  బ్రాండింగ్ చేసి మార్కెట్ లో విక్రయించడం వలన కోట్ల రూపాయిల ఆదాయం సమకూరుతుందని వివరించారు. అడవి సందపను కాపాడటంలో ఇప్పటివరకు 1550 వాహనాలను, 2600 మంది నేరస్థులను, 7వేల మెట్రిక్ టన్నుల దుంగలను పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
 అడవి చుట్టూ కాంటూర్ కందకాలు తవ్వడం, అక్కడక్కడ గేట్లు అమర్చుకోవడం వలన చాలావరకు అక్రమ రవాణాకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చునని సీయం సూచించారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు పాతపద్దతులు వదిలిపెట్టి సాంకేతికంగా శిక్షణ పొంది విధుల్లో చురుకుగా పాల్గొనాలని సీయం ఈ సమావేశంలో హితవు పలికారు. అటవీశాఖ మంత్రి శ్రీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు