ఎన్టీఆర్ టెంపర్‌ను రిజక్ట్ చేసిన రెడ్‌స్టార్

విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి విప్లవ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు. పేదలు, సమస్యలు, ప్రజల ఎజెండాగానే ఆయన చిత్రాలు ఉంటాయి. ఎర్రజెండాతో టాలీవుడ్ స్క్రీన్‌ను షేక్ చేసి పెద్దల గుండుల్లో దడ పుట్టించిన ఘనత రెడ్‌స్టార్ ఆర్.నారాయణమూర్తికే చెందుతుంది. ఎర్రసైన్యం, ఎర్రదండు, చీమలదండు, ఎర్రన్న, ఒరేయ్‌రిక్షాతో పాటు తాజాగా రాజ్యాధికారం ఇలా ఎన్నో విప్లవాత్మక చిత్రాలతో ప్రజల సమస్యలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

నారాయణమూర్తి అంటే దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక అభిమానం. పూరి తన కెమేరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని కూడా ఆయనకే అంకితమిచ్చి నారాయణమూర్తిపై ఉన్న తన ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. తాజాగా పూరి -ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న టెంపర్ సినిమాలో పూరి నారాయణమూర్తి కోసం ఓ మంచి పాత్రను డిజైన్ చేశాడు. ఆ పాత్రలో నటించాలని నారాయణమూర్తిని పూర్తి రిక్వెస్ట్ చేశారట. ఆ పాత్రలో నటించేందుకు ఆసక్తి ఉందని నారాయణమూర్తి ఎన్టీఆర్‌ను కూడా కలిసి చెప్పారట. అయితే చివరకు కమ్యూనిజం భావజాలం మెండుగా నిండి ఉన్న ఆయన కమర్షియల్ సినిమాల్లో నటిస్తే తనపై వేరే ముద్ర పడుతుందని… తనకు ఉన్న ప్రత్యేకతకు భంగం కలుగుతుందని భావించి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఓ మంచి పాత్రలో నటించే అవకాశం వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్టీఆర్, పూరి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సింపుల్‌గా వదులుకున్నారు. దటీజ్ నారాయణ మూర్తి.