కేసీఆర్‌ గేలానికి చిక్కిన రేవంత్… టీడీపీ నేత‌ల ఆవేద‌న‌..!

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేసిన గేలానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చిక్కాడాని తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీల్ విషయంలో అనుమానించాల్సింది పోయి అడ్డంగా దొరికిపోయాడని ఆందోళన చెందుతున్నారు. చాలామందికి పేరు కూడా తెలియని నామినేటెడ్‌ ఎమ్మెల్యే వద్దకు రేవంత్‌ రెడ్డి వంటి నేత ఎందుకు వెళ్లారు. కేసీఆర్ వేసిన స్కెచ్‌లో ఆయ‌న ఇరుక్కుపోయారా అన్న అనుమానాలను టీడీపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రేవంత్‌పై తెరాస సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఏమాత్రం ఆలోచన లేకుండా దొరికిపోయారన్న చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ నుంచి టీడీపీ నేతలకు కొన్ని సంకేతాలు అందాయని అంటున్నారు. తెరాస ఆకర్ష్‌ నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న టీటీడీపీ నేతలు ఆయనను సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్య‌వ‌హారంలో చాలా ప్ర‌ణాళిక‌తో ఉండాల్సింది పోయి రేవంత్ కేసీఆర్ గేలానికి చిక్క‌డంతో టీడీపీ ఎన్నిక‌ల రోజున పూర్తిగా డిఫెన్స్‌లో ప‌డిన‌ట్ల‌య్యింది. 

రేవంత్‌ రెడ్డితోనే తాను మాట్లాడ‌తాన‌ని స్టీఫెన్ చెప్ప‌డంతో చివ‌ర‌కు రేవంత్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. అయితే బ‌య‌ట ఈ వ్య‌వ‌హారాన్ని డీల్ చేయాల్సిన రేవంత్ నేరుగా స్టీఫెన్ ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యారు. పక్కా ప్రణాళికతో ఇంటినిండా నిఘా కెమెరాలతో సిద్ధంగా ఉన్న స్టీఫెన్‌ పక్కా ఆధారాలతో రేవంత్‌ను బిగించేశారని అంటున్నారు. కేసీఆర్‌ విసిరిన ఎరకు రేవంత్‌ చిక్కుకుపోయారని టీడీపీ నేత‌లు వాపోతున్నారు.