రేవంత్ దూకుడుకు బ్రేకుల్లేవ్.. డిఫెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ తేదేపా నేత ఎనుముల రేవంత్‌రెడ్డి మరోసారి తన దూకుడుతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. శాసనసభ సమావేశాల సందర్భంగా రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ విమర్శలను తెరాస నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్ట లేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్రసర్వే పేరిట రాష్ట్ర ప్రజలను 12 గంటల పాటు నిర్భంధించి నానా ఇబ్బందులకు గురి చేసిందని ఆయన విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకంగా 25 శాతం ప్రజలు తమ వివరాలు నమోదు చేయించుకోలేదన్నారు. వితంతువులను మీకు పెళ్లయ్యిందా అని అడగడం తెలంగాణ సంస్కృతిని అవమానపరిచినట్టేనన్నారు. ఆ రోజు హడావిడిగా వివరాలు నమోదు చేయించుకోవడానికి వస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సర్వేలో ఆస్తుల వివరాలు అడిగినా.. అప్పులు వివరాలు ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆ రోజు బస్సుడిపోలను మూసి బార్లను మాత్రం బార్లా తెరిచారని రేవంత్ ధ్వజమెత్తారు. చాలామంది వివరాలు నమోదు చేయించుకోలేదేని ఇలాంటి వారి కోసం ఆధార్ తరహాలో కౌంటర్లు పెట్టి ప్రజల వివరాలు పూర్తిగా నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కనీసం సర్వే ముందు అఖిలపక్షం పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి రాలేదన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత పేరు రెండుచోట్ల నమోదు చేశారని .. ఇందుకు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ దూకుడుకు అసెంబ్లీలో తెరాస బ్రేక్‌లు వేయలేకపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.