వ‌ర్మ అస‌లైన రంగు – రుచి – వాస‌న చెప్ప‌డానికి `ప‌రాన్న జీవి` సిద్ధం

విచిత్రం.. ఏమిటంటే.. అంద‌రినీ వ‌ర్మ కెల‌క‌డం త‌ప్ప – వ‌ర్మ జోలికి పోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌రు. కానీ.. అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు క‌దా..? వ‌ర్మ‌ని కాల‌ర్ ప‌ట్టుకుని, నెత్తిమీద రెండు మొట్టికాయ‌లు వేసే వాడు ఎవ‌డో ఒక‌డు, ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తాడు. ఈసారి వ‌చ్చేశాడు కూడా. అంద‌రిపై సినిమాలు తీసే వ‌ర్మ‌పై ఓ సినిమా తీస్తున్నారిప్పుడు. పేరేంటో తెలుసా? `ప‌రాన్న జీవి`.

ఎప్పుడూ పక్కోడిపై ప‌డిపోయి, బ‌తికేసే ఆర్జీవికి.. భ‌లే సూటైపోయిన పేరు క‌దా..?

ప‌వ‌న్ పై వ‌ర్మ సినిమా తీస్తుంటే.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డం – టాక్ ఆఫ్ ది టౌన్ కాక మ‌రేమిటి? వ‌ర్మ‌పై సెటైరిక‌ల్ సినిమా తీయాల‌ని చాలామంది అనుకున్నారు. కానీ బుర‌ద‌లో రాళ్లేయ‌డం ఎందుక‌ని… ఆగిపోయారు. కానీ వ‌ర్మ బుర‌ద కాదు. బుర‌ద‌లో దొర్లే ప‌శువు అనుకున్నాడే ఏమో.. ఓ అభిమాని తిర‌గ‌బ‌డ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. దానికి ఫ‌లిత‌మే `ప‌రాన్న జీవి` సినిమా..

ప‌వ‌న్ గురించి వ‌ర్మ ఏం తీస్తాడో, ఎన్ని కాక్ అండ్ బుల్ క‌థ‌లు అల్ల‌బోతున్నాడో ఈజీగా ఊహించేయొచ్చు. కానీ.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఎలాంటి సినిమా తీస్తాడో? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. అటు వర్మ తీసే `ప‌వ‌ర్ స్టార్‌`, ఇటు ఆర్జీవిపై తీస్తున్న `ప‌రాన్న‌జీవి`. రెండూ ఇప్పుడు పోటాపోటీగా `తెర‌` ప‌డుతున్నాయి. త్వ‌ర‌ప‌డుతున్నాయి. ప‌వ‌న్ అభిమానుల అండ దండ‌దండ‌లు `ప‌రాన్న‌జీవి`పై ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. ప‌ప‌ర్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ `ప‌వ‌ర్ స్టార్‌` కోసం ఎదురు చూడ్డంలో ఆశ్చ‌ర్యం లేదు. అటు ప‌వ‌న్ యాంటీ ఫ్యాన్సా? ఇటు ప‌వ‌న్ అస‌లైన అభిమానులా? అనేది ఇప్పుడు తేల‌బోతోంది? రాంగోపాల్ వ‌ర్మ అస‌లైన రంగు – రుచి – వాస‌న చెప్ప‌డానికి `ప‌రాన్న జీవి` సిద్ధం అవుతోంది. మ‌రి వీటిలో ఎవ‌రిది పైచేయో తెలియాలంటే జ‌స్ట్ ఇంకొన్ని రోజులు ఆగితే స‌రిపోతుంది.