కార్టూనిస్టు ఆర్‌కె.లక్ష్మణ్ కన్నుమూత…ఇండియన్ కార్టూన్ కింగ్‌గా

ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్‌కె.లక్ష్మణ్ (94) కన్నుమూశారు. కొంత కాలంగా పూణేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 1927 నవంబర్ 27న కర్ణాటకలోని మైసూరులో ఆయన ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఆయన తన ప్రస్థానం ప్రారంభించారు. ప్రముఖ రచయిత ఆర్‌కె.నారాయణ్, లక్ష్మణ్ ఇద్దరూ సోదరులే. లక్ష్మణ్ భార్య కమలా లక్ష్మణ్ కూడా రచయిత్రిగా పేరొందారు. లక్ష్మణ్ తన తండ్రికి జన్మించిన ఆరుగురు సోదరుల్లో చివరి వారు. 

లక్ష్మణ్ 1951లో ప్రారంభమైన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ది కామన్ మేన్ పేరిట రోజువారి కార్టూన్లతో దేశవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకర్షించారు. ఇండియన్ కార్టూన్ కింగ్‌గా వెలుగొందారు. ఆయన ప్రముఖ భరతనాట్య కళాకారిణి, అలనాటి మేటి సినీనటి కుమారి కమలను పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య వచ్చిన విబేధాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకు మొదటి భార్య పేరే ఉన్న పిల్లల పుస్తకాలు రాసే రచయిత్రి కమలను వివాహం చేసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయన రామన్ మెగసెసె, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.