రోహిత్ రికార్డుల మోత-మూడు ప్రపంచరికార్డులు బద్దలయ్యాయి

భారత్-శ్రీలంక ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా కలకత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు రోహిత్‌శర్మ రికార్డులు మోతమోగించాడు. మొత్తం మూడు ప్రపంచరికార్డులు తిరగరాశాడు. రోహిత్‌శర్మ ఓపెనర్‌గా దిగి విధ్వసం సృష్టించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోచాడు. రోహిత్ శర్మ 148 బంతుల్లో 22 ఫోర్లు, 5 సిక్సర్లతో వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. 

రోహిత్‌శర్మ మొత్తం 173 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 152.60 స్ట్రైక్ రేటుతో 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. రెండు నెలల తర్వాత శిఖర్‌ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అవి

1.వన్డేల్లో సెహ్వాగ్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు 219 పరుగులను క్రాస్ చేసి 264 పరుగుల అత్యధిక వ్యక్తి గత స్కోరు సాధించాడు.
2.వన్డేల్లో ఎవ్వరికి సాధ్యంకాని విధంగా రెండోసారి డబుల్ సెంచరీ సాధించాడు.
మొత్తం ప్రపంచంలో నాలుగుసార్లు మాత్రమే డబుల్ సెంచరీలు నమోదైతే అవన్నీ భారత్ ఆటగాళ్లే సాధించారు. సచిన్, సెహ్వాగ్ ఒక్కో డబుల్ సెంచరీ సాధిస్తే రోహిత్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.
3.ఇక వన్డేల్లో ఒకే ఇన్సింగ్స్‌లో 33 ఫోర్లు కొట్టి మరో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.