రోహిట్ శర్మ.. భారత్ -4.. శ్రీలంక-0 శ్రీలంకకు అవమానాల పరంపర

భారత్-శ్రీలంక ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా కలకత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన నాలుగో వన్డేలో 153 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇప్పటికే తొలి మూడువన్డేలు గెలుచుకుని సీరిస్ గెలుచుకున్న భారత్ తాజా విజయంతో తన ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు సాధించి శ్రీలంకకు 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత యువ ఆటగాడు రోహిత్‌శర్మ ఓపెనర్‌గా దిగి విధ్వసం సృష్టించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోచాడు.

రోహిత్ శర్మ 148 బంతుల్లో 22 ఫోర్లు, 5 సిక్సర్లతో వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. మిగిలిన భారత ఆటగాళ్లలో రహానే 28, కోహ్లీ 66 పరుగులు సాధించారు. రోహిత్‌శర్మ మొత్తం 173 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 152.60 స్ట్రైక్ రేటుతో 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. అనంతరం 405 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలకం 43 ఓవర్లలో కేవలం 251 పరుగులకు ఆల్అవుట్ అయ్యి 153 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక ఆటగాళ్లలో మాథ్యూస్ 75, తిరుమాన్నే 59 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో కులకర్ణి 4 వికెట్లు తీశారు. ఇక వరుసగా నాల్గో ఓటమితో శ్రీలంక ఘోర అవమానాలు ఎదుర్కొటోంది. రోహిత్‌శర్మ మ్యాన్ఆఫ్‌దమ్యాచ్‌గా ఎంపికయ్యాడు.