తప్పు తెలుసుకున్న ఎన్టీఆర్

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రూటుమార్చాడు. ఇటీవల కాలంలో వరుసపెట్టి తప్పులు చేస్తున్న జూనియర్ ఇక నుంచి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్ మనవడిగా అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ తర్వాత చేజేతులా పొరపాట్లు చేసి ఆ క్రేజ్ తగ్గించుకున్నాడు. నందమూరి వంశంలో ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తర్వాత ఆ స్థానాన్ని భరీ చేసేది జూనియర్ అని ఎప్పుడో ప్రశంసలు పొందినా అదంతా గతం. ఎప్పుడో 2003లో వచ్చిన సింహాద్రి తర్వాత ఆ స్థాయి హిట్ లేదు. 2010లో వచ్చి ఓ మోస్తరుగా ఆడిన బృందావనం తర్వాత కనీసం అలాంటి సినిమా కూడా అతడి నుంచి రాలేదు. రోజురోజుకు మార్కెట్ తగ్గిపోవడంతో అతడి రేటు సైతం తగ్గించుకున్నట్టు వినికిడి. అయితే తప్పులు సరిచేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఇటీవల ఎన్నికల్లో తేదేపా కష్టకాలంలో ఉన్నా పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత వారిలో చాలా మంది మద్దతు కోల్పోయాడు. నందమూరి అభిమానులకు, తేదేపా క్యాడర్‌కు దగ్గరయ్యేందుకు అభిమానులతో ఓ మెగా మీట్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సమావేశానికి విశాఖపట్నం వేదిక కానుందని టాక్. ప్లాపులొచ్చినంతమాత్రాన అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేదని ఆయన అంటున్నాడట. తన అభిమానులందరితోను స్వయంగా మాట్లాడి వారితో ఫొటో సెషన్ మీట్ కూడా ఏర్పాటు చేసి వారి సలహాలు కూడా తీసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ఆయన అభిమానులతో పాటు నందమూరి అభిమానుల్లో కూడా సంతోషం వ్యక్త మవుతోంది.