గ్యాంగ్ లీడ‌ర్ పై క‌న్నేసిన మెగా మేనల్లుడు..

మేన‌మామ‌ల్ని వాడుకోవ‌డంలో సాయిధ‌రంతేజ్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఇంకా రెండు సినిమాల అనుభ‌వ‌మే ఉన్నా.. చ‌ర‌ణ్, బ‌న్నీలు కూడా సాయి స్థాయిలో చిరంజీవిని వాడేసి ఉండ‌రేమో. పైగా మేన‌ల్లుడు కావ‌డంతో పోలిక‌లు కూడా దిగిపోయాయి. డాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ అన్నింట్లోనూ చిరంజీవి క‌నిపించేస్తున్నాడు. ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి సినిమాల్లో మీకు బాగా ఇష్ట‌మైన సినిమా ఏంటి.. రీమేక్ చేయాల‌నుకుంటున్న సినిమా ఏంటి అని అడిగితే మ‌రో ఆలోచ‌న లేకుండా గ్యాంగ్ లీడ‌ర్ పేరు చెప్పేసాడు సాయిధ‌రంతేజ్. ఆ సినిమాలో చిరు మాస్ యాక్ష‌న్ దుమ్ము లేపేస్తుందంటున్నాడు మెగా మేన‌ల్లుడు. 

గ్యాంగ్ లీడ‌ర్ తో పాటు చంట‌బ్బాయ్ అంటే కూడా త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. అది కూడా రీమేక్ లిస్ట్ లో ఉందంటున్నాడు సాయిధ‌రంతేజ్. ప్ర‌స్తుతానికి ఇవి ఊహ‌ల్లోనే ఉన్నా.. ఫ్యూచ‌ర్ లో మామ సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మంటున్నాడు సాయి. ఇప్ప‌టికైతే సాంగ్స్ రీమిక్స్ వ‌ర‌కు మాత్ర‌మే మావ‌య్య‌ను వాడేస్తున్నాడు సాయిధ‌రంతేజ్. ప్ర‌స్తుతం ఈ హీరో న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.