సాయిధ‌రం స్టార్ అయిపోయిన‌ట్లేనా..?

మెగాఫ్యామిలీ నుంచి ఏ హీరో వ‌చ్చినా కాస్త క‌ష్ట‌ప‌డితే స్టార్ అయిపోతారు. ఒక్క శిరీష్ మాత్ర‌మే దీనికి మిన‌హాయింపు. వ‌రుణ్ తేజ్ కూడా స్టార్ అయ్యే దిశ‌గా ఒక్కో అడుగు వేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ కుటుంబం నుంచి చిరంజీవి ఎలాగూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే బ‌న్నీ, చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ హీరోలుగా చ‌క్రం తిప్పేస్తున్నారు. ఈ న‌లుగురి స‌ర‌స‌న చేరేందుకు తాజాగా సాయిధ‌రంతేజ్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మేనమామ చిరంజీవి మాదిరే తొలి సినిమా విడుద‌ల కాకుండా.. రెండో సినిమా పిల్లా నువ్వులేని జీవితంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సాయి. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత రేయ్ వ‌చ్చి వెళ్లినా.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ కూడా ఓకే అనిపించింది. ఆ సినిమా యావ‌రేజ్ గా నిలిచినా 20 కోట్ల వ‌రకు వ‌సూలు చేసింది. 

 

సాయి కెరీర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఏంటంటే టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుతో బాగా క‌నెక్ట్ అయిపోవ‌డం. ఇప్ప‌టికే పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ నిర్మించిన రాజు.. ఇప్పుడు అనిల్ రావిపూడితో సుప్రీమ్ చిత్రాన్ని నిర్మించాడు. అది మే 5న విడుదల అవుతుంది. దీంతోపాటు మ‌రో సినిమా కూడా లైన్ లో ఉంది. వీటితో పాటే.. సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తిక్క‌ సినిమా చేస్తున్నాడు సాయి. గోపీచంద్ మ‌లినేని సినిమాకు కూడా క‌మిట‌య్యాడు మెగా మేన‌ల్లుడు.

ఇక ఇప్పుడు మార్కెట్ లోనూ సాయి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. సుప్రీమ్ ప్రీ రిలీజ్ బిజినెస్సే దీనికి నిద‌ర్శ‌నం. దాదాపు 24 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మేసాడు దిల్ రాజు. ర‌వితేజ‌, నాని లాంటి క్రేజీ హీరోల మార్కెట్ తో ఇది స‌మానం. ఆ 24 కోట్లు రిక‌వ‌ర్ చేస్తే సాయి స్టార్ అయిపోయిన‌ట్లే. ఒక్క గుంటూర్ ఏరియాలో సుప్రీమ్ ని 2.10 కోట్ల‌కు కొనేసార‌ని స‌మాచారం. టాప్ హీరోల‌కే ఇలాంటి రేట్ వ‌స్తుంది. అలాంటిది నాలుగో సినిమాకే సాయిధ‌రం ఈ రికార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు న‌టిస్తున్న సినిమాల్లో స‌గం హిట్టైనా సాయిధ‌రంతేజ్ ద‌శ తిర‌గ‌డం ఖాయం. పైగా డాన్సుల్లో, న‌ట‌న‌లో మేనమామ చిరు పోలిక‌లు కనిపిస్తుండ‌టం సాయికి క‌లిసొచ్చే అంశం.