సాయిధ‌రంతేజ్ విన్న‌ర్ అవుతాడా..?

అదేంటి.. ఇప్ప‌టికే విన్న‌ర్ వ‌చ్చి పోయింది కూడా క‌దా..! ఇప్పుడు విన్న‌ర్ ఏంటి అనుకుంటున్నారా..? మొన్న వ‌చ్చింది విన్న‌ర్ సినిమా.. కానీ ఇప్పుడు రియ‌ల్ లైఫ్ లో విన్న‌ర్ అవుతాడా అని. ప్ర‌స్తుతం సాయిధ‌రంతేజ్ కెరీర్ అదోలా ఉంది. తిక్క‌.. విన్న‌ర్ సినిమాలు సాయి మార్కెట్ ను ప‌డ‌గొట్టేసాయి. దాంతో ఇప్పుడు నిల‌బెట్టుకునే ప‌నిలో ఉన్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు సాయిధ‌రంతేజ్. ఈ సినిమాలే ఇప్పుడు సాయి కెరీర్ కు ఊపిరి. ఇందులో ఒక‌టి మాస్ అయితే.. మ‌రో సినిమా క్లాస్. ఖైదీ నెం.150 లాంటి సినిమా త‌ర్వాత ఏరికోరి సాయిధ‌రంతేజ్ తో సినిమా చేస్తున్నాడు వినాయ‌క్. ఆకుల శివ అందించిన క‌థ‌కు సాయి అయితేనే ప‌ర్ ఫెక్ట్ అని భావించాడు వినాయ‌క్. ఇక క‌రుణాక‌ర‌ణ్ తో ఓ ప్రేమ‌క‌థ‌ను మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. ఈ రెండు సినిమాల‌తో మ‌ళ్లీ కెరీర్ లో పుంజుకోవాల‌ని చూస్తున్నాడు సాయిధ‌రంతేజ్. నిజానికి ఫ్లాపుల్లో ఉన్న ఈ టైమ్ లో ఇలాంటి రెండు క్రేజీ సినిమాలు సాయికి ప‌డ‌టం నిజంగా గొప్ప విష‌య‌మే. ఈ రెండు గ‌న‌క అంచ‌నాలు అందుకుంటే.. సాయిధ‌రంతేజ్ రేంజ్ అలా అలా పెరిగిపోవ‌డం ఖాయం.